లండన్ పర్యటనలో రాహుల్‌గాంధీ మన దేశ ప్రజాస్వామ్యం చెరలో ఉందని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. విదేశీ గడ్డపై రాహుల్ దేశం గురించి ఇలా మాట్లాడినందుకు అభ్యంతరం ఉండవచ్చు, కానీ ఆయన మాటల్లో నిజం లేదా? దేశం నియంతృత్వం వైపు అడుగులు వేస్తున్నది నిజం కాదా?
అన్ని వ్యవస్థలను బీజేపీ, కేంద్రం తమ కనుసన్నల్లో ఆడిస్తున్నది నిజం కాదా? చివరకు ఎన్నికల సంఘం కమిషనర్ల విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది ఇదే కదా? తమను నియమించే వారి ముందు చేతులు కట్టుకొని భయపడుతూ పని చేసే కమిషనర్లు కాదు, స్వతంత్రంగా పని చేసే వారు ఉండాలని చెప్పింది కదా? బీజేపీ, దాని అనుబంధ సంస్థలు దేశంలోని మీడియా, న్యాయవ్యవస్థ, పార్లమెంట్, ఎన్నికల సంఘం వంటి వాటిలోకి చొరబడి భారత ప్రజాస్వామ్య స్వరూపాన్నే మార్చేస్తున్నారని రాహుల్ అన్నదాంట్లో అవాస్తవం ఏముంది?
ప్రభుత్వ విధానాలను విమర్శించే వారి ని, పాలకుడిని తప్పు పట్టే విపక్షాల నాయకులపై కేంద్రసంస్థల దాడులు, కేసులు ఈ స్థాయిలో గతంలో ఎప్పుడైనా చూశామా? సీబీఐ, ఈడీ దాడులకు లొంగిపోయి బీజేపీలో చేరితే ఆ తరువాత కేసులు ఉండవు, విచారణ ఉండదు. లొంగకపోతే జైలుకు సైతం పంపుతున్నారు. ఇది నియంతృత్వం కాకుంటే మరేమిటి? ప్రజాస్వామ్యం చెరలో ఉందని రాహుల్ చేసిన విమర్శలు నిజం కాదని బీజేపీ నేతలు చెప్పగలరా? విదేశీ గడ్డపై విమర్శలు చేయటాన్ని తప్పు పడుతున్నారు కానీ విషయాన్నీ మాత్రం కాదనడం లేదు.
పార్లమెంటులో వాజపేయి ఉపన్యాసం వీడియో ఒకటి ఈ మధ్య విన్నాను. ‘నెహ్రూ అభిప్రాయాలతో విభేదిస్తూ, తీవ్రంగా విమర్శిస్తూ కూడా మాట్లాడేవాడిని. ఒకసారి సభలో నేను నెహ్రూను ఉద్దేశించి మీలో ద్వంద్వ ప్రవృత్తి ఉంది. మీలో చర్చిల్ ఉన్నారు, ఛాంబర్లేన్ ఉన్నారు అన్నాను (ఛాంబర్లేన్ తర్వాత బ్రిటన్ ప్రధాని పదవిని చర్చిల్ చేపట్టారు). సాయంత్రం కలిసినప్పుడు నెహ్రూ నవ్వుతూ దగ్గరకు వచ్చి ఈ రోజు జోర్దార్గా ఉపన్యాసం ఇచ్చారు అంటూ భుజం తట్టి వెళ్లారు. ఈ రోజుల్లో ఇలాంటివి ఊహించగలమా? ఇలా మాట్లాడాం అంటే ఇప్పుడు శతృత్వానికి పిలుపు ఇచ్చినట్టే. మనం దేశం కోసం కలిసి పని చేయలేమా?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని వాజపేయి పార్లమెంట్లో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోని పరిస్థితులకే ఆయన ఇంతగా ఆవేదన చెందితే, ఇప్పుడు మోదీ పాలన చూసి ఉంటే ఏమనేవారో. ఇప్పుడు కేంద్రం నిర్ణయాలను ప్రశ్నించినా, మోదీని విమర్శించినా విపక్షాలపై సీబీఐ, ఈడీ దాడులు, కేసులు. మిత్రుడి లక్షల కోట్ల ఆర్థిక అవకతవకలతో ప్రపంచం ముందు దేశం పరువు పోయినా స్పందన ఉండదు, పట్టపగలు శాసన సభ్యుల కొనుగోలుకు బేరాలు ఆడుతూ వీడియోలకు చిక్కినా ఏమీ కాదు. పెద్ద తలలు కనీసం విచారణకు కూడా హాజరు కారు. కానీ, తమ పార్టీలో చేరమంటే చేరనందుకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని జైలు పాలు చేస్తారు. అలా చేరిన వారిపై కేసులు ఉండవు. అస్సాం సీఎం మొదలుకొని టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సీఎం రమేష్ సుజనా చౌదరి తదితరులు కేంద్ర సంస్థల దాడులు జరగ్గానే బీజేపీలో చేరారు. ఆ తరువాత వారిపై విచారణ ఊసే లేదు. ఈ అక్రమాలను ప్రశ్నిస్తే దేశద్రోహి అనే ముద్ర, పాకిస్థాన్ వెళ్లి పో అంటూ తిట్లు.
మతాన్ని, దేశభక్తిని బీజేపీ ప్రచార అస్ర్తాలుగా వాడుకుంటున్నది. నిజంగా దైవం మీద అంత భక్తి ఉంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనైనా మంచి ఆలయాలు నిర్మించి ఉండే వారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని భారీ ఎత్తున పునఃనిర్మించడమే కాకుండా రాష్ట్రంలోని అనేక ఇతర ఆలయాల కోసం భారీ ఎత్తున నిధులు కేటాయించారు. ఇలాంటి పనులను బీజేపీ నుంచి ఆశించలేం. కేవలం మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఓట్ల పంట పండించుకోవాలి అనేదే వీరి రాజకీయం. చివరకు అదానీ అవకతవకలు బయటపడినా కూడా దేశంపై దాడి అని ప్రచారం. మతం, దేశభక్తి పేరుతో దేశంలో ఒక రకమైన అభద్రతా భావాన్ని సృష్టించడం తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తుంది.
ఉగ్రవాదం, మతతత్వం వల్ల ఈ రోజు పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ వంటి దేశాలు ఎలా సంక్షోభంలో కూరుకుపోయాయో చూస్తున్నాం. అంతిమంగా ఈ ప్రపంచానికి కావలసింది ప్రజాస్వామ్యమే. ప్రజాస్వామ్యయుతంగానే సమస్యలు పరిష్కరించుకోవాలి, అభివృద్ధి సాధించాలి.
హిట్లర్ జాతీయ వాదాన్ని ఇప్పటికీ అభిమానించే జర్మన్లు ఉన్నారు. జాతీయ వాదం పేరుతో హిట్లర్ ప్రపంచ యుద్ధానికి కారణం అయ్యాడు. లక్షలాది మంది మరణానికి, ప్రపంచం ముందు జర్మనీ దోషిగా నిలవడానికి కారణం అయ్యాడు. ఇస్లామిక్ ఉగ్రవాదం, హిట్లర్ జాతీయవాదం.. పేరు ఏదైనా కావచ్చు, ఇవేవీ ప్రజలకు స్వేచ్ఛను, అభివృద్ధి ఫలాలను ఇవ్వలేవు. ప్రపంచానికి శాంతిని ఇవ్వలేవు. ఉగ్రవాదం, మతతత్వం వల్ల ఈ రోజు పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ వంటి దేశాలు ఎలా సంక్షోభంలో కూరుకుపోయాయో చూస్తున్నాం. అంతిమంగా ఈ ప్రపంచానికి కావలసింది ప్రజాస్వామ్యమే. ప్రజాస్వామ్యయుతంగానే సమస్యలు పరిష్కరించుకోవాలి, అభివృద్ధి సాధించాలి. అధికారం లోకి రావాలి అన్నా, అధికారంలో ఉన్న వారిని దించేయాలి అన్నా ప్రజాస్వామ్యయుతంగానే ప్రయత్నాలు జరగాలి.
భారత ప్రజాస్వామ్య దుస్థితిని చూస్తూ కూడా ఐరోపా, అమెరికాల్లోని ప్రజాస్వామ్య మద్దతుదారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని రాహుల్ గాంధీ ప్రశ్నించడం హాస్యాస్పదం.
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ముందుగా దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సింది కాంగ్రెస్ పార్టీ. మీరు మీ బాధ్యత మరిచిపోయి అమెరికా, యూ రప్ ఎందుకు స్పందించడం లేదు అని అ డుగుతున్నారు. కాంగ్రెస్ దశాబ్దాల పాటు ఈ దేశాన్ని పాలించిన పార్టీ. ఇప్పటికీ దేశంలో అనేక ప్రాంతాల్లో ఎంతో కొంత ఉనికి ఉన్న పార్టీ. సొంత రాష్ట్రం నుంచి దేశమంతా అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ మోదీని నిలదీస్తున్నప్పు డు.. దేశమంతటా ఉనికి ఉన్న కాంగ్రెస్ బాధ్యత ఎంత ఉండాలి? ఒక వైపు బీజేపీ నియంతృత్వం, మరో వైపు నడిపించే నా యకుడు లేని కాంగ్రెస్, దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి.
బుద్దా మురళి