Durgapur case : పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రం దుర్గాపూర్ (Durgapur) లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ (Private medical college) లో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని (MBBS student) పై ఇటీవల కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిందితుల్లో ముగ్గురిని ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ఆదివారం రాత్రి పట్టుబడ్డాడు. తాజాగా సోమవారం మధ్యాహ్నం ఇంకో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ విషయాన్ని అసన్సోల్ దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది.
అయితే అరెస్టయిన నిందితుల వివరాలను పోలీసులు ఇంకా బయటికి వెల్లడించలేదు. ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన 23 ఏండ్ల యువతి.. దుర్గాపూర్‌లోని ఐక్యూ సిటీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్నది. శుక్రవారం రాత్రి తన ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లగా కొందరు యువకులు వారిని వెంబడించారు. యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని నిందితులు అక్కడే వదిలేసి పారిపోయారు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.