న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)లో కార్డియో థోరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ శాఖ అధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ ఏకే బిసోయిని సస్పెండ్ చేశారు. తనను వేధిస్తున్నట్లు ఓ మహిళా నర్సింగ్ ఆఫీసర్ ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. ఎయిమ్స్‌కు చెందిన నర్సుల సంఘం .. పీఎంవోకు పదేపదే ఫిర్యాదులు చేయడంతో ఈ చర్యకు పాల్పడ్డారు. లైంగికంగా వేస్తున్నాడని, నీచమైన భాషను వాడుతున్నాడని, పని ప్రదేశంలో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కార్డియో అధిపతిపై నర్సులు ఫిర్యాదు చేశారు.
ఏకే బిసోయిని సస్పెండ్ చేయడంతో ఆ బాధ్యతలను సీటీవీఎస్ డిపార్ట్మెంట్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ వీ దేవగౌరవ్కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 30వ తేదీన ఫిర్యాదు లేఖ అందినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఆ తర్వాత అక్టోబర్ 9వ తేదీన నర్సుల యూనియన్ పీఎంవోకు ఫిర్యాదు చేసింది. పని ప్రదేశంలో వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. తనపై ఫిర్యాదు చేసేవాళ్లను బెదిరించేలా ఆ డాక్టర్ వ్యవహరించినట్లు నర్సులు వెల్లడించారు.
లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా దుర్భాషలాడేవారన్నారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నది. ఇంటర్నల్ కంప్లెయింట్స్ కమిటీకి ఆ ఫిర్యాదును రిఫర్ చేయనున్నారు. గతంలో కూడా డాక్టర్ ఏకే బిసోయిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 2009లో కేంద్ర ఆరోగ్యశాఖ ఆయన్ను సస్పెండ్ చేసింది. అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019లో కూడా వేధింపు ఫిర్యాదులు ఉన్నాయి.