సూర్యాపేట, అక్టోబర్ 13 : ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను నిలువున దగా చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డులను సోమవారం సూర్యాపేట పట్టణంలోని 46వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు ఆంగోతు బావ్ సింగ్ ఆధ్వర్యంలో ఇంటింటికి పంపిణీ చేసి మాట్లాడారు. 22 నెలలు కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క రంగంలో ప్రజలు బాగుపడలేదన్నారు. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజా రంజక పాలనను అందిస్తే నేడు రైతులు, రైతు కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను హామీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నదని అందులో భాగంగా ప్రజలకు బాకీ పడ్డ నగదు వివరాలను తెలుపుతూ కాంగ్రెస్ బాకీ కార్టులను ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
రైతులకు రుణమాఫీ, మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థినిలకు స్కూటీలు, వికలాంగులు, వృద్ధులకు పెన్షన్ల పెంచుతామని పెంచకుండా బాకీ పడ్డారన్నారు. దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని, కాంగ్రెస్ బాకీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ ప్రజల వెంట ఉంటుందని, హామీల అమలుకు పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మాజీ జడ్పీటీసీ జిడి భిక్షం, బీఆర్ఎస్ నాయకులు బండారు రాజా, ఆంగోతు బావ్ సింగ్, మద్దూరి సుధాకర్, చిట్టిపాక రాములు, మేడే సాగర్, దాసోజు దేవేంద్రాచారి, కృష్ణారెడ్డి, రజిని, అనూష, ఉపేంద్ర పాల్గొన్నారు.
Suryapet : బాకీలు వసూలు చేసేంత వరకు పోరాటం ఆగదు : బడుగుల లింగయ్య యాదవ్