దామరచర్ల, సెప్టెంబర్ 25 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం పార్తూనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బతండాకు చెందిన తేజావత్ అశోక్ నాయక్ టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో ఆర్డీఓగా ఎంపికయ్యాడు. 562 గ్రూప్-1 సర్వీస్ పోస్టులకు అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ బుధవారం అర్థరాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ప్రాధాన్యతా క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది.
మారుమూల గిరిజన తండాకు చెందిన అశోక్ నాయక్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అశోక్ నాయక్ 1 నుండి 7వ తరగతి వరకు నేతాజీ హైస్కూల్ దామరచర్లలో, 8 నుండి 10వ తరగతి వరకు గిరిజన గురుకుల పాఠశాల అవంతీపురంలో చదివాడు. పాలిటెక్నిక్ కోర్సును సనా కళాశాల కోదాడలో, బీటెక్ ను ధృవ కళాశాల హైదరాబాద్లో పూర్తి చేశాడు. అనంతరం సివిల్స్ లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది గ్రూప్-1కు ఎంపికయ్యాడు. ఆర్డీఓగా అశోక్ నాయక్ ఎంపిక పట్ల మండల వాసులు హర్షం వ్యక్తం చేశారు.