అడవిలో ఉద్యోగం చేయడం అంటేనే ఓ సాహసం. అలాంటిది కజీరంగా లాంటి అతిపెద్ద జాతీయ పార్కుకి నేతృత్వం వహించడం, అక్కడి జంతువుల సంరక్షణా బాధ్యతల్ని తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ బెంగాలీ కుటుంబానికి చెందిన డా॥ సోనాలి ఘోష్ ఆ క్లిష్టతరమైన పనిని చేపట్టడమే కాదు, అందులో ప్రపంచ గుర్తింపునూ పొందారు. జాతీయ పార్కుల సంరక్షణా విభాగంలో ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత కెంటన్ మిల్లర్ అవార్డును భారత్ నుంచి అందుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికైన నాటి నుంచీ ప్రస్తుతం కజీరంగా ఫీల్డ్ డైరెక్టర్ పదవి దాకా అడవులు, జంతువుల పరిరక్షణలో ఆమెది ప్రత్యేకమైన శైలే.
చెట్టు పుట్టల కోసం పనిచేస్తున్నా, అందులో ఉండే జంతుజాలం కోసం పనిచేస్తున్నా వాటి పట్ల ప్రేమ, సహానుభూతి ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ పనిని సమర్థంగా నిర్వర్తించగలం అని చెబుతారు సోనాలి. తనకు తొలి నుంచీ సువిశాలమైన నిశ్శబ్దమైన ప్రదేశాలతో అనుబంధం ఉంది. విభిన్నమైన ప్రాంతాలతో సంబంధాలున్నాయి. తండ్రి ఆర్మీలో పనిచేయడం వల్ల ఆమె కంటోన్మెంట్ ప్రాంతంలో నివసించేది. అందరూ ప్రవేశించలేని చోట్లు ఆమెకేం కొత్తకాదు. ఉద్యోగ రీత్యా మాటికో ఊరు మారడమూ అలవాటే. అయితే బ్రహ్మపుత్రా నది వరదలు పోటెత్తే అసోంలోని కజీరంగా జాతీయ పార్కును, అందులోని వేల సంఖ్యలోని వన్యప్రాణులను సంరక్షించే బాధ్యత మాత్రం మరింత కష్టతరమైనది.
ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. 1100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ సువిశాలమైన జాతీయ పార్కుకి ఆమే తొట్ట తొలి మహిళా ఫీల్డ్ డైరెక్టర్. ఆమెది ఇక్కడ కేవలం ఆఫీసులో కూర్చుని నిర్వర్తించే పని మాత్రమే కాదు. అక్కడి సున్నితమైన వాతావరణాన్ని, ప్రత్యేకమైన జంతుజాలాన్నీ, ఆ చుట్టు పక్కల్లో నివసిస్తున్న మనుషుల్నీ జాగ్రత్తగా సమన్వయం చేయాల్సిన ప్రత్యేకమైన బాధ్యత. దాని నిర్వహణలో ఆమె విజయవంతమైందని చెప్పడానికి అనేక అంశాలున్నా, ప్రస్తుత అవార్డు ఓ మచ్చుతునకగా చెప్పవచ్చు.

1975వ సంవత్సరంలో పుణెలో మధ్య తరగతి బెంగాలీ కుటుంబంలో జన్మించారు సోనాలి. వన్యప్రాణి, అటవీ శాస్ర్తాల్లో రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు చేశారు. వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఆమె చదువుకున్నారు. భౌగోళిక శాస్త్రంలో యూకేలో పీహెచ్డీ చేశారు. 2000-2003 సంవత్సరపు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ బృందంలో టాపర్‌గా నిలిచారు. పర్యావరణ చట్టాల మీదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేశారు. ఇండో భూటాన్ సరిహద్దుల్లో మానస్ ప్రాంతంలోనూ పులుల ఆవాసాల పర్యవేక్షణకు సంబంధించి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలోనూ డాక్టరేట్‌ను సంపాదించారు. తాను చదివిన ప్రతి అక్షరాన్నీ తన పనిలో మార్పు కోసం ఉపయోగించే స్వభావం సోనాలిది.
అందుకే తాను అసోంలోని జూకు కన్జర్వేటర్‌గా పనిచేసినా, ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్లో పనిచేసినా, ప్రస్తుతం కజీరంగాకు నేతృత్వం వహిస్తున్నా ప్రతి చోటా తనదైన ముద్రవేశారు. జూల ద్వారా జంతువులు వాటి ఆవాసాల గురించి బాగా తెలుసుకుంటే, ఫారెస్ట్రీలో పనిచేసినప్పుడు స్థానికులతో కలిసి గోల్డెన్ లాంగూర్ (బంగారు రంగు కోతిజాతి)ల పరిరక్షణకు పాటుపడ్డారు. 118 ఏండ్ల కజీరంగా జాతీయ పార్కు చరిత్రలో తొలి మహిళా ఫీల్డ్ డైరెక్టర్‌గా ఎంపికైన ఆమె తొలి దశలో తన నిర్ణయాల విషయంలో లింగ వివక్షను ఎదుర్కొన్నారట. ప్రతి అంశాన్నీ నిరూపించి చూపించాల్సి వచ్చేదని ఆమె ఓ సందర్భంలో పంచుకున్నారు.

ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన కజీరంగా నేషనల్ పార్కులో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉన్నాయి. ఇది టైగర్ రిజర్వ్ కూడా. వెయ్యికిపైగా ఏనుగులూ ఇక్కడ సంచరిస్తుంటాయి. నీటిబర్రెలు, దుప్పులు, ఎలుగుబంట్లు, గంగా డాల్ఫిన్లు, ఆటర్లు, ఎన్నో సరీసృపాలు, లెక్కకు మిక్కిలి పక్షిజాతులకు ఇది ఆలవాలం. చిత్తడి నేలలు, గడ్డినేలలు, సతత హరితారణ్యాలు… ఇలా రకరకాల విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి.
నాలుగు నదులు గజిబిజిగా ప్రవహించే ఈ చోటులో బ్రహ్మపుత్ర నది వరదలు సంభవిస్తూ ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతల కారణంగానే కజీరంగాలో విభిన్న జీవజాలం మనగలుగుతున్నది. అయితే ఇంత సున్నితమైన ప్రత్యేక వాతావరణాన్ని సంరక్షిస్తూ జంతువుల పరిరక్షణ చేయడం అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్న విషయమని ఆమెకు తొలినాళ్లలోనే అర్థమైంది. అందుకే ముందుగా అడవుల్లో ఉండి పనిచేసే ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పరిస్థితుల గురించి మాట్లాడారు. ప్రమాదరకరమైన ప్రదేశాల్లో పనిచేసే వీరి సంక్షేమానికి పెద్ద పీట వేశారు.

తద్వారా వారు మరింత సమర్థంగా పనిచేయడం ప్రారంభించారు. దీని సరిహద్దుల చుట్టూ ఉండే స్థానికులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ, పార్కు పరిరక్షణలో వారి సలహాలు, సాయం తీసుకుంటూ, వారికి అడవి మీద ఆధారపడని ఉపాధి మార్గాల సృష్టికి మార్గాలు వేశారు. అక్కడి ఖడ్గమృగాలు, పులుల సంరక్షణకు బలమైన ప్రొటోకాల్‌ను తీసుకొచ్చారు. కజీరంగాలో బాధ్యతాయుతమైన ఎకో టూరిజానికి నాంది పలికారు. తద్వారా చుట్టుపక్కల గ్రామాల వారికి ఆదాయ వనరులు ఏర్పడ్డాయి.
ఇలా వినూత్నమైన, సుస్థిరమైన రీతిలో ఆ ప్రాంతాన్నీ, వన్యప్రాణుల్నీ సంరక్షించినందుకే వరల్డ్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ వారు ఇచ్చే ప్రఖ్యాత కెంటన్ మిల్లర్ అవార్డు ఆమెను వరించింది. ఇటీవలే అబూదాబిలో ఆమె దీన్ని అందుకున్నారు కూడా. ఆడవాళ్లు కొన్ని రంగాలకే పరిమితం అనే భావనను చెరపడానికీ, అడవుల్లో కూడా అమ్మాయిలు సమర్థంగా పనిచేయగలరని నిరూపించడానికీ సోనాలీ ఘోష్ ఓ చక్కని ఉదాహరణ.