మూసాపేట/కౌకుంట్ల (చిన్న చింతకుంట), అక్టోబర్ 28 : కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ఉద్దాల ఊరేగింపుతో కురుమూర్తి కొండలు పులకించాయి. మంగళవారం ఉద్దాల మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇతర రాష్ర్టాలతో పాటు వివిధ జిల్లా నుంచి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో కురుమూర్తికి చేరుకున్నారు. ఉదయం నుంచే గోవింద నామస్మరణతో కురుమూర్తి కొండలు మార్మోగాయి. భక్తులు స్వామి వారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకోగా మహిళలు అత్యంత నియమనిష్టలతో దాసంగాలు పెట్టి నైవేద్యాలు సమర్పించారు.
చిన్నవడ్డెమాన్ గ్రామం నుంచి ఊరేగింపు
చిన్నచింతకుంట మడలంలోని చిన్నవడ్డెమాన్లో మండపంలో ఉద్దాలకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, నెల్లి వంశస్తులైన మనోహర్‌రెడ్డి, మా జీ ఎమ్మెల్యే సీతమ్మతో కలిసి పూజలు నిర్వహించారు. అక్కడే భక్తులకు దర్శనం కోసం ఉద్దాలను కొంత సమయం ఉంచి అక్కడి నుంచి వాగులో నుంచి తరలిస్తుండగా ఉద్దాల దర్శనం, స్పర్శ కోసం భక్తులు చాటకింద దూరారు. అక్కడి నుంచి ట్రాక్టర్‌పై అప్పంపల్లి, తిరుమలాపూర్ మీదుగా కురుమూర్తి ఆలయ సమీపంలో ఉన్న మం డపం వద్దకు చేరుకున్నాక ప్రత్యేక పూజలు చేశారు. ఉద్దాల ఊరేగింపులో మంగళ వాయిద్యాలు, భక్తుల భజనలు, సిగసత్తుల పూనకాలు సందడి చేశారు. మండపానికి చేరుకోవడంతో వేడుక ముగిసింది.
రెండు లక్షలకు పైగానే భక్తులు
పాలమూరుతోపాటు వివిధ జిల్లాలు, ఇతర రాష్ర్టాలకు చెందిన కుటుంబాలు కురుమూర్తిస్వామి ఇంటి దేవుడు కావడంతో ఉద్దాల రోజు దర్శించుకోవడం ఆనవాయితీ. అందు కే భక్తులు ఎవరి స్థాయి మేరకు మోటర్ సైకిల్స్, ఆటోలు, కార్లు, జీపులు, ఎడ్ల బండ్లు, బస్సులు, గూడ్స్ వాహనాలు.. ఇలా ఎవరికి వారు నలుమూలల నుంచి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెద్దసంఖ్యలో భక్తులు కురుమూర్తిస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో స్వామి ఆలయం పరిసర ప్రాంతాలన్నీ భక్తులు, వాహనాలతో నిండిపోయాయి. అయితే ఉద్దాలు ఊరేగింపునకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దాదాపుగా 2 లక్షలకుపైగానే తరలివచ్చినట్లు పరిశీలకులు చెబుతున్నారు. కురుమూర్తి రోడ్డువద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ నుంచి గుట్టపై ఉన్న కాంచనగహలోని స్వామి వారి దర్శనం వరకు భక్తులు భారీగా క్యూకట్టారు. గంటల తరబడి వేచి ఉంచి స్వామివారిని దర్శించుకున్నారు.

నిరంతరం పర్యవేక్షణ
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టమై ఉద్దాల ఊరేగింపునకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారనే ముందస్తుగానే కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశాల, స్థానిక ఎమ్మెల్యే జీఎంఆర్ సూచన మేరకు ఎస్పీ జానకి దగ్గరుండి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిరంతరం పోలీసు సిబ్బందితో బందోబస్తు చర్యలు తీసుకున్నారు. వారితో పాటు పాలక మండలి సభ్యులు, రె వెన్యూ, వైద్య, శాఖాధికారులు పర్యవేక్షణ చే స్తూ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.