సూర్యాపేట, జనవరి 4(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం, అసమర్థతతోపాటు కేసీఆర్‌పై ఆక్రోశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గత రెండు యాసంగి సీజన్లలో సూర్యాపేట జిల్లాలోని గోదావరి ఆయకట్టుకు నీళ్లందక వేలాది ఎకరాల్లో వరి ఎండిపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుత యాసంగికైనా నీళ్లిస్తారా? లేక గాలికి వదిలేసి చివరికి పంట ఎండబెడతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో 2.95 లక్షల ఎకరాల్లో వరిసాగు అంచనా ఉండగా, ఇప్పటికే దాదాపు 80శాతం నాట్లు పూర్తయినట్టు వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించారు. వానకాలంలో కురిసిన వర్షాలతో బావులు, బోర్లలో నీళ్లు ఉండడంతో ప్రస్తుతానికి నాట్లు వేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ, పంట చేతికి వచ్చే సమయానికి కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుంటే నీళ్లు అందకపోవచ్చని ఇరిగేషన్‌శాఖ అధికారుల ద్వారా తెలుస్తున్నది.
స్వరాష్ట్రంలో, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలతోపాటు రైతన్న లాభపడ్డాడు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పూర్తిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పంటపొలాలు సస్యశ్యామలం అయ్యాయి. ప్రతి యాసంగిలో దాదాపు 3 నెలలపాటు 30 నుంచి 40 టీఎంసీల చొప్పున కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను విడుదల చేయడంతో లక్షల ఎకరాల్లో వరి పండింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో.. గత రెండు యాసంగి సీజన్లకు గోదావరి జలాలు రాకపోవడంతో వరి ఎండిపోయింది. దీంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై రైతన్నల ఆందోళనలు, ప్రతిపక్షాల నిరసనలు వెల్లువెత్తాయి.
నీటి నిర్వహణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. గత యాసంగి సీజన్ల మాదిరిగా కాకుండా అప్రమత్తంగా ఉండని పక్షంలో రైతులకు భారీ నష్టం కలిగే ప్రమాదం ఉన్నది. చిన్న సాకుతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పట్టించుకోని ప్రభుత్వం.. 2024 సీజన్లో లక్షకు పైగా, 2025లో 70వేల ఎకరాల వరకు వరి ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి కూడా అలాగే వ్యవహరిస్తే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. ప్రభుత్వం పంతానికి పోకుండా కాళేశ్వరం పంపులను ఆన్‌చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్టు నీటిని అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పదేండ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ సార్ రైతులను కడుపున పెట్టుకొని చూసుకున్నడు. కానీ, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను పట్టించుకున్న పాపాన పోవట్లేదు. రేవంత్ పాలనలో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద రెండుసార్లు యాసంగి పంటలు ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయాం. ఈ సారైనా యాసంగికి నీళ్లు విడుదలచేసి ఆయకట్టు రైతులను ఆదుకోవాలి.
– పానుగోతు రవినాయక్, నూర్జహాన్‌పేట