– 20 ఏండ్లుగా డేరాలలోనే ఎండకి ఎండుతూ వానకు తడుస్తున్నాం
– పురుగు బూచిగుట్టి ఎప్పుడు చస్తమో తెలియడం లేదు
– కోదాడలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఆవేదన
– మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ భరోసా
కోదాడ, జనవరి 21 : గత రెండు దశాబ్దాలుగా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ అప్పటి నుండి ఇప్పటివరకు కోదాడ పట్టణంలో ఖాళీ జాగాలో పాత గుడ్డలను డేరాలుగా మార్చుకుని బతుకులీడుస్తున్నారు చిరునామా లేని కోతుల వాళ్లు. చిత్తు కాగితాలు ఏరుకోవడం, కోతులను ఆడించడం, పిల్లలతో సర్కస్ చేయించడం, చిన్న చితక పనులు చేసుకుంట ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నారు. దుర్భర జీవితాలను అనుభవిస్తూ జీవచ్ఛవాల్లా కాలం గడుపుతున్నారు. ఆ ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త ప్రమీల వారి బాధలు గమనించి పలుమార్లు తాసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు తిప్పి రేషన్ కార్డులు మంజూరు చేయించారు. ఇక 2023లో నాటి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బాలాజీ నగర్లో 560 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయించిన విషయం తెలిసిందే. కలెక్టర్ పర్యవేక్షణలో ఆర్డీఓ సమక్షంలో సీసీ కెమెరాలు మధ్య నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేసిన క్రమంలో 12 మంది కోతుల వారికి కూడా ఇండ్లు మంజూరు అయ్యాయి.
ఇక మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులను గృహ ప్రవేశాలు చేయించే పరిస్థితిలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అయినప్పటికీ మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాల్సిన అధికారులు తమ బాధ్యతను మరవడంతో ఇప్పటికీ గృహ ప్రవేశాలు జరగని పరిస్థితి. దీంతోపాటు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో సదరు డబల్ బెడ్రూం ఇల్లు శిథిలావస్థకు చేరే పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇల్లు అప్పగించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళన చేపట్టారు. వసతులు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇండ్లు అప్పగించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బుధవారం సైతం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి బాధితులను కలిసి పరామర్శించారు. లబ్ధిదారులు మాజీ ఎమ్మెల్యే ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమరు తప్పా ఇప్పటివరకు ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వారే లేరని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే స్పందిస్తూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం, అధికారులతో కొట్లాడైనా సరే ఇండ్లు అప్పగిస్తామని భరోసా ఇచ్చారు. సమస్య పరిష్కారం అయ్యేదాకా వదిలిపెట్టేది లేదన్నారు. త్వరలో మన ప్రభుత్వం వస్తుందని మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పారు.
రెండు సంవత్సరాల క్రితం మా అయ్య కేసీఆర్ మాకు ఇల్లు మంజూరు చేశాడు. ఆయనకు రుణపడి ఉంటాం. ఇక్కడ పాత గుడ్డల డేరాలో ఎప్పుడు పురుగు బూచి కుడుతుందో మా పిల్లగాళ్లకి ఏమవుతుందో అని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. కరెంట్ అవసరం లేదు. చీకటి ఇంట్లోనైనా ఉంటాం. మా ఇల్లు మాకు అప్పగించండి. మీరు తప్ప మమ్మల్ని ఎవరూ పలకరించిన పాపాన పోలేదు. ఇల్లు అప్పగించే బాధ్యత నీదేనయ్యా.