– ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ ఎస్పీ వీరభద్రస్వామి
దుమ్ముగూడెం, అక్టోబరు 01 : ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలను ఇంటింటికీ చేరేలా సిబ్బంది కృషి చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి అన్నారు. గురువారం దుమ్ముగూడెం సబ్ పోస్టాఫీసులో నిర్వహించిన ఇంటింటికీ పోస్టల్ ఖాతా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు పోస్టల్ శాఖ ద్వారా అందుబాటులో ఉన్న వివిధ సేవలపై గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ గ్రామీణ పోస్టల్ జీవిత బీమా సౌకర్యం కల్పించేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. రూ.10 లక్షల వరకు ప్రయోజనం కలిగించే పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీపై ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సమయంలో పోస్టల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం ఎస్పీఎం రవికుమార్, ఎంఓ సుధీర్, రవి, దుమ్ముగూడెం సబ్ పోస్టాఫీస్ పరిధిలోని బీపీఎంలు, ఏబీపీఎంలు పాల్గొన్నారు.