ఎండకాలం వేడిని తట్టుకోవాలంటే కూలర్లలోనే కాదు, పొట్టలోనూ నీళ్లను దండిగా నింపాల్సిందే. కానీ ఎంత ఎండకాలమైనా మాటిమాటికీ నీళ్లు తాగడం కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ ఆ పనిని ఆకర్షణీయంగా మార్చేందుకు సరికొత్త ఆకృతుల్లో వాటర్ బాటిళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఆ కోవలోవే ఈ ‘డోనట్ షేప్డ్ వాటర్ బాటిళ్లు’. తియ్యగా మనం తినే డోనట్ మధ్యలో రంధ్రం ఉన్నట్టే ఈ బాటిళ్లకు కూడా మధ్యలో ఖాళీ ఉంటుంది.
చూసేందుకు భిన్నంగా పట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. కొన్నిటికి ఇలా మధ్యలో రంధ్రం రాకపోయినా చూసేందుకు మాత్రం అచ్చం డోనట్‌లా ఉండి తగిలించుకునేందుకు స్ట్రాప్ ఉండేలా వస్తున్నాయి. వీటిని బయటికి వెళ్లినప్పుడు ఎంచక్కా భుజానికి వేసుకుని వెళ్లొచ్చు. లేదా స్ట్రాప్‌లు తీసేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. పిల్లలు కూడా వాడగలిగేలా సిప్పర్ తరహాలో తయారవుతున్నాయివి. కావాలంటే నచ్చిన రంగు, డిజైన్లలో వీటిని చేసిచ్చే కంపెనీలూ ఉన్నాయి. కాబట్టి డోనట్ తినడమే కాదు, ఇప్పుడు డోనట్లో ఎంచక్కా తాగేయొచ్చు కూడా!