న్యూఢిల్లీ, ఆగస్టు 29: భారత్-పాకిస్థాన్ ఘర్షణల్లో మధ్యవర్తిత్వం వహించేందుకు తనను అనుమతించలేదన్న వ్యక్తిగత కోపంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 50 శాతం సుంకాలు విధించారని అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫెరీస్ తన నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది మేలో భారత్, పాక్ మధ్య జరిగిన నాలుగు రోజుల సైనిక ఘర్షణల్లో జోక్యం చేసుకోవాలని ట్రంప్ ఆశించారని నివేదిక పేర్కొంది.
భారత్, పాకిస్థాన్ మధ్య సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఉద్రిక్తతలను అంతం చేసేందుకు తన జోక్యాన్ని అనుమతించలేదన్న ట్రంప్ వ్యక్తిగత కోపమే ప్రాథమికంగా సుంకాల ఫలితమని నివేదిక తెలిపింది. పాకిస్థాన్‌తో తమ సంబంధాల విషయంలో తృతీయ పక్షం జోక్యాన్ని భారత్ ఎన్నడూ అనుమతించలేదని, ఈ లక్ష్మణ రేఖ కారణంగానే నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయని నివేదిక వెల్లడించింది.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య బంధం క్షీణించడానికి వ్యవసాయం మరో ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. వ్యవసాయ రంగంలో దిగుమతులకు భారత్ ఏనాడూ తలుపులు బార్లా తెరవలేదని జెఫెరీస్ నివేదిక పేర్కొన్నది.