న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి వెల్లడించారు. ఒకే రోజు రెండు సార్లు ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీన జరిగిన నేషనల్ ఫ్రేయర్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 8 యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ చెప్పారు. కంబోడియా, థాయ్‌ల్యాండ్, కొసావో, సెర్బియా, అర్మేనియా, అజర్బైజాన్ యుద్ధాలను ఆపినట్లు తెలిపారు. వీటితో పాటు ఇండియా, పాకిస్థాన్ మధ్య సంక్షోభాన్ని కూడా పరిష్కరించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత ట్రుత్ సోషల్ పోస్టులో కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్పారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య న్యూక్లియర్ వార్‌ను ఆపినట్లు పేర్కొన్నారు.
ప్రపంచంలో అమెరికా అత్యంత శక్తివంతమైన దేశం అని, తన తొలి హయాంలో మిలిటరీని బలోపేతం చేశానని, కొత్త అణ్వాయుధాలను సమీకరించామని, స్పేస్ ఫోర్స్‌ను జోడించామని, సైన్యాన్ని దశలవారీగా పునర్ నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. కొత్త యుద్ధ నౌకలను తయారు చేస్తున్నామని, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తిరిగిన ఐయోవా, మిస్సోరి, అలబామా లాంటి యుద్ధ నౌకల కంటే వంద రెట్లు శక్తివంతమైన నౌకలను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అణ్వాయుధ యుద్ధాలను ఆపానని, పాకిస్థాన్.. ఇండియా, ఇరాన్-ఇజ్రాయిల్, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ తన పోస్టులో తెలిపారు. అయితే ఇండోపాక్ వార్ ఆపినట్లు ట్రంప్ ఇప్పటికి కనీసం 90 సార్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో గత ఏడాది మే 10వ తేదీన ఇండోపాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరినట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ తమ విషయంలో మూడో దేశం జోక్యం చేసుకోలేదని భారత్ చెబుతూ వస్తున్నది. రెండు దేశాల మధ్య నేరుగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ఇండియా చెప్పింది.