అంతర్జాతీయ వాణిజ్య సమరానికి సర్వం సిద్ధం చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా వ్యవహరించే అగ్రరాజ్యాధిపతే.. ప్రతీకార సుంకాలకు ముహూర్తం ఖరారు చేశారు మరి. వచ్చే నెల నుంచి భారత్‌సహా చైనా, మరికొన్ని దేశాలపై అధిక టారిఫ్లుంటాయని వైట్‌హౌజ్‌లో ట్రంప్ ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.
Donald Trump | న్యూయార్క్/వాషింగ్టన్/న్యూఢిల్లీ, మార్చి 5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టిన పట్టు వీడటం లేదు. తమ దేశ వస్తూత్పత్తులపై అధిక సుంకాలు వేస్తున్న దేశాలపై త్వరలో ప్రతీకార సుంకాలు తప్పవంటూ గతకొద్ది రోజులుగా హెచ్చరిస్తూ వస్తున్న ట్రంప్.. అన్నంత పనికి రెడీ అయ్యారు. ఏప్రిల్ 2 నుంచి భారత్, చైనా మరికొన్ని దేశాలపై అధిక సుంకాలుంటాయని అధికారికంగా ప్రకటించారు. రెండోసారి అగ్రరాజ్యానికి అధ్యక్షుడైన ట్రంప్.. వైట్‌హౌజ్‌లో తాజాగా తొలిసారి జరిపిన కాంగ్రెస్ జాయింట్ సెషన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా నుంచి దిగుమతి అవుతున్న గూడ్స్‌పై భారత్ అధిక సుంకాలు వసూలు చేస్తున్నదని విమర్శించారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆక్షేపించారు. అందుకే తామూ అదే స్థాయిలో ఆయా దేశాలపై పరస్పర సుంకాలకు దిగబోతున్నట్టు తేల్చిచెప్పారు. దీంతో ఒక్కసారిగా వాణిజ్య యుద్ధం భయాలు చుట్టుముట్టాయి.
100 శాతానికిపైగా..
‘అమెరికా నుంచి భారత్‌లోకి దిగుమతి అవుతున్న ఆటోమొబైల్స్‌పై అక్కడ 100 శాతానికిపైగా టారిఫ్‌లు పడుతున్నాయి. ఇది అస్సలు సరికాదు. నిజానికి దశాబ్దాల కాలం నుంచి అమెరికా వస్తూత్పత్తులపై ఆయా దేశాలు అధిక సుంకాలు వేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు, చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడాల గురించి మీరు వినే ఉంటారు. అమెరికా కంటే ఎక్కువగా టారిఫ్‌లు వేస్తున్న దేశాల సంఖ్య లెక్కే లేదు మరి. ఇప్పుడు వాటన్నిటిపై అమెరికా కూడా అధిక టారిఫ్‌లు వేసేందుకు సిద్ధమైంది’ అని ట్రంప్ అన్నారు. గత నెల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీతో కూడా ప్రతీకార సుంకాలు తప్పవని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి విదితమే.
ప్రతీకార సుంకాలు
ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఆయా దేశాలూ ప్రతీకార సుంకాలకు సై అంటున్నాయి. ఆదివారం తమ నిర్ణయం వెల్లడిస్తామని మెక్సికో తెలిపింది. చైనా కూడా అమెరికా నుంచి తమ దేశంలోకి దిగుమతి అవుతున్న ప్రధాన వ్యవసాయోత్పత్తులపై 15 శాతం వరకు అదనపు సుంకాలు తప్పవని హెచ్చరించింది. కెనడా ఈ నెల 4 నుంచే ప్రతీకార సుంకాలకు దిగింది. 30 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా గూడ్స్‌పై 25 శాతం సుంకాలు వేసింది. అయితే కెనడా, మెక్సికోలపై 25 శాతం అదనపు టారిఫ్‌లను వేస్తున్న అమెరికా.. చైనాపై 10 శాతం అదనపు టారిఫ్‌లను వేసింది. మొత్తానికి ట్రంప్ సుంకాలు మొదలైతే వచ్చే నెలలో వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరడం ఖాయమే.
ట్రంప్ ఏమంటున్నారు?