ముంబై, జనవరి 9 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలకు తోడు ఎఫ్ఐఐలు అమ్మకాలకు మొగ్గుచూపడం సూచీలు నష్టాల పాలయ్యాయి. వీటికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నష్టాలకు మరింత ఊతమిచ్చాయి. ఫలితంగా ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా మార్కెట్ వాటాను కోల్పోయాయి. ముఖ్యంగా రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆటో స్టాక్స్‌లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 25 వేల దిగువకు జారుకున్నది.
చివరకు సెన్సెక్స్ 604.72 పాయింట్లు కోల్పోయి 84 వేల దిగువకు 83,576.24 వద్దకు జారుకున్నది. అలాగే 50 షేర్ల ఇండెక్స్ సూచీ నిఫ్టీ సైతం 193.55 పాయింట్లు కోల్పోయి 25,683.30 వద్ద స్థిరపడింది. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. దేశీయ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 500 శాతం సుంకం విధించనున్నట్టు ప్రకటించడంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ప్రస్తుతం మార్కెట్లో సెంటిమెంట్ నిరుత్సాహకరంగా ఉన్నదని, ఉద్రిక్త పరిస్థితులకు తోడు ట్రంప్ టారిఫ్ బాంబు పేల్చనుండటం మదుపరుల్లో ఆందోళన నెలకొన్నదని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
విదేశీ మారకం నిల్వలు మరింత కరిగిపోయాయి. ఈ నెల 2తో ముగిసిన వారాంతానికిగాను 9.80 బిలియన్ డాలర్లు కరిగిపోయిన ఫారెక్స్ రిజర్వులు 686.801 బిలియన్ డాలర్లకు పడిపోయినట్టు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. గతవారంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 7.622 బిలియన్ డాలర్లు తగ్గి 551.99 బిలియన్ డాలర్లకు పడిపోవడం ఇందుకు కారణమని వెల్లడించింది. అలాగే గోల్డ్ రిజర్వులు కూడా 2.058 బిలియన్ డాలర్లు తగ్గి 111.262 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.