న్యూఢిల్లీ, జనవరి 9 : ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ సుజుకీ మోటర్.. తాజాగా ఈ-స్కూటర్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. ‘ఈ-యాక్సెస్’ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ధర రూ.1.88 లక్షలుగా నిర్ణయించింది. 3.07 కిలోవాట్ల లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీతో తయారైన ఈ స్కూటర్ గంటకు 71 కిలోమీటర్ల వేగంతో సింగిల్ చార్జింగ్‌తో 95 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. ఈ స్కూటర్‌కు చెందిన బ్యాటరీ పూర్తిస్థాయిలో చార్జింగ్ కావడానికి 6.42 గంటల సమయం పట్టనున్నది. రిటైల్ అమ్మకాలు ప్రారంభించిన తర్వాత ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ స్కూటర్ లభించనున్నది. ఏథర్ రిజ్టా, బజాజ్ చెతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1లకు పోటీగా సంస్థ ఈ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది.