న్యూఢిల్లీ, జనవరి 9 : ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)కు గత నెలలో గిరాకీ తగ్గింది. గతంతో పోల్చితే డిసెంబర్లో పెట్టుబడుల ప్రవాహం 6 శాతానికిపైగా క్షీణించి రూ.28,054 కోట్లకు పరిమితమైంది. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే కారణమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నిర్వహణలోని ఆస్తులు నవంబర్లో రూ.80.80 లక్షల కోట్లుగా ఉంటే.. డిసెంబర్లో రూ.80.23 లక్షల కోట్లకు దిగజారాయని శుక్రవారం ఇండస్ట్రీ సంఘం యాంఫీ విడుదల చేసిన గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే డెట్ స్కీముల నుంచి భారీగా జరిగిన పెట్టుబడుల ఉపసంహరణలకు ఇది అద్దం పడుతున్నదని యాంఫీ సీఈవో వెంకట్ ఎన్ చలసాని అంటున్నారు.
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)లకు ఆదరణ కొనసాగుతున్నది. డిసెంబర్లో సిప్ల ద్వారా రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ ఆల్టైమ్ హైని తాకుతూ రూ.31,000 కోట్లకు చేరింది. నవంబర్లో ఇది రూ.29, 445 కోట్లే. ఇక ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్లోకి రూ.10,019 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.