న్యూఢిల్లీ, జనవరి 9 : వాహన కొనుగోలుదారులకు టయోటా షాకిచ్చింది. ప్రీమియం ఎస్‌యూవీలైన ఫార్చ్యూనర్, ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్ మాడళ్ల ధరలను రూ.74 వేల వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. వీటిలో ఇన్నోవా క్రిస్టా మాడల్ రూ.33 వేల వరకు పెంచుతుండగా దీంతో ప్రస్తుతం ఈ మాడల్ రూ.18.99 లక్షల నుంచి రూ.25.53 లక్షల లోపు దేశవ్యాప్తంగా లభిస్తున్నది.
అలాగే ఇన్నోవా హైక్రాస్ మాడల్‌ను రూ.48 వేల వరకు సవరించడంతో దీని ధర రూ.19.15 లక్షల నుంచి రూ.32.38 లక్షల లోపు చేరుకున్నది. దీంతోపాటు ఫార్చ్యూనర్ రూ.74 వేలు, లెజెండరీ మాడళ్ల ధరలను రూ.71 వేలు వరకు సవరించింది. వీటి ధరలు రూ.34.16 లక్షల నుంచి రూ.49.59 లక్షల లోపు లభిస్తున్నాయి. కానీ, టైజర్, హైరైడర్, రుమియన్, హిలక్స్, క్యామ్రీ, వెల్ఫైర్, ల్యాండ్ క్రూజర్ 300 మాడళ్ల ధరలను యథాతథంగా ఉంచింది. మరోవైపు, హైక్రాస్, ఫార్చ్యూనర్ మాడళ్లను నిలిపివేసేయోచనలో సంస్థ ఉన్నట్టు తెలుస్తున్నది.