Stock Markets | ముంబై, నవంబర్ 27 : దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. గత కొన్నిరోజులుగా భారీగా నష్టపోయిన అదానీ గ్రూపు షేర్లు తిరిగి లాభాల్లోకి రావడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 230.02 పాయింట్లు అందుకొని తిరిగి 80 వేల పైకి 80,234.08కు చేరుకున్నది.
మరో సూచీ నిఫ్టీ సైతం 80.40 పాయింట్లు అందుకొని 24,274.90 వద్ద నిలిచింది. 24,354 గరిష్ఠ స్థాయి నుంచి 24,145 కనిష్ఠ స్థాయిలో కదలాడిన నిఫ్టీ చివరకు 80 పాయింట్లకు పైగా లాభపడింది. మధ్యాహ్నాం వరకు తీవ్ర ఊగిసలాటలో కదలాడిన సూచీలకు ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు జోష్ పెంచాయి. ఫలితంగా భారీ లాభాలవైపు కదంతొక్కాయి.