దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలకు దూరంగా ట్రేడ్ అవుతున్నాయి. గతకొద్ది రోజులుగా మదుపరులు పెట్టుబడులకు సంశయిస్తున్నారు. ఫలితంగా సూచీలు నష్టాలకే పరిమితం కావాల్సి వస్తున్నది. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 270.07 పాయింట్లు లేదా 0.33 శాతం పడిపోయి 81,451.01 దగ్గర నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 102.45 పాయింట్లు లేదా 0.41 శాతం కోల్పోయి 24,750.70 వద్ద స్థిరపడింది. ఈ వారం కూడా సూచీలు పడుతూలేస్తూ పయనించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ఈ నెల 4-6 తేదీల్లో నిర్వహించనున్నది. దీంతో వడ్డీరేట్లపై ఆర్బీఐ నిర్ణయాల ఆధారంగా మార్కెట్లు ట్రేడ్ అయ్యే వీలున్నదని చెప్పవచ్చు.
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా జరిగిన రెండు ద్రవ్యసమీక్షల్లో రెపోరేటును ఆర్బీఐ అర శాతం తగ్గించిన విషయం తెలిసిందే. రాబోయే ద్రవ్యసమీక్షలోనూ మరో పావు శాతం తగ్గవచ్చన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే బ్యాంకింగ్, ఆటో, రియల్టీ, ఇతరత్రా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు ఆకర్షణీయం కానున్నాయి. సూచీలు తిరిగి లాభాలను సంతరించుకోవచ్చు. ఇక ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు, ముడి చమురు ధరలు దేశీయ మార్కెట్లను నిర్దేశించనున్నాయి. అయితే అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 24,300 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,000 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. కానీ సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,300-25,500 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.