గతకొద్ది వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో ముగుస్తున్నా యి. ఈ క్రమంలో ఈ వారం మదుపర్లు లాభాల స్వీకరణకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నది. దీంతో ఆటుపోట్లకు ఆస్కారముందని చెప్పవ చ్చు. గత వారం అంతకుముందు వారంతో పోల్చితే సెన్సెక్స్ 663.44 పాయింట్లు లేదా 0.86 శాతం అందుకుని 77,763.91 దగ్గర నిలిచింది. నిఫ్టీ 214.85 పాయింట్లు లేదా 0.89 శాతం పెరిగి 24,270.85 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో ఈ వారం పెట్టుబడుల ఉపసంహరణలకు మదుపర్లు ప్రాధాన్యత ఇవ్వవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
అయినప్పటికీ అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను మరికొంతకాలం యథాతథంగానే ఉంచవచ్చన్న ఊహాగానాలు నూతన పెట్టుబడులకు ఉత్సాహాన్నివ్వగలదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇక గల్ఫ్ వార్ అప్డేట్స్ కూడా కీలకమే. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, ఎల్‌నినో సంబంధిత సమాచారం సైతం ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చు. క్రూడాయిల్ రేట్ల ఆధారంగా చమురు, సహజ వాయువు షేర్ల భవితవ్యం ఉంటుంది. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 24,000 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,800 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,500-24,700 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చనీ చెప్తున్నారు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.