ముంబై, జనవరి 21 : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలకు లోనయ్యాయి. ఉదయం ఆరంభంలో లాభాల్లో కదలాడినా.. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,235.08 పాయింట్లు లేదా 1.60 శాతం కోల్పోయి 75,838.36 వద్ద ముగిసింది. ఒకానొక దశలోనైతే 1,431.57 పాయింట్లు పడిపోయింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ కూడా 320.10 పాయింట్లు లేదా 1.37 శాతం దిగజారి 23,024.65 వద్ద స్థిరపడింది. గత ఏడాది జూన్ 6 తర్వాత ఈ స్థాయికి సూచీ రావడం ఇదే తొలిసారి. కాగా, ఇంట్రా-డేలోనైతే 367.90 పాయింట్లు పతనమైంది.
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మళ్లీ వాణిజ్య యుద్ధానికి తెరతీస్తారన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ఒక్కసారిగా దెబ్బతీశాయి. అగ్రరాజ్య రక్షణాత్మక ధోరణులతో ఇతర దేశాల ఆర్థికావకాశాలు క్షీణిస్తాయన్న భయాందోళనలు మదుపరుల్లోనూ చెలరేగాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లలో అలజడి చోటుచేసుకున్నది. నిజానికి ఎన్నికల ప్రచారంలోనే పొరుగు దేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతయ్యే వస్తూత్పత్తులపై సుంకాలను 10 నుంచి 20 శాతం విధిస్తామని, చైనా నుంచి వస్తున్నవాటికైతే టారీఫ్‌లు 60 శాతంగా ఉంటాయని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ ట్రంప్.. సుంకాల సమరానికి కాలు దువ్విన సంగతి విదితమే. ఈ క్రమంలో ఇప్పుడూ అదే సంకేతాలు వస్తున్నాయి. వచ్చే నెల మొదలు కెనడా, మెక్సికోల నుంచి జరిగే దిగుమతులపై దాదాపు 25 శాతం సుంకాలు విధించే యోచనలో ఉన్నామని ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఆ రెండు దేశాల నుంచి అమెరికాలోకి పెద్ద ఎత్తున అక్రమ వలసలు జరుగుతున్నాయని, నార్కోటిక్స్ వస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. వీటిని అరికట్టేందుకే సుంకాలను పెంచాలని చూస్తున్నట్టు చెప్పారు. మున్ముందు ఇతర దేశాలపైనా ట్రంప్ ఇదే దుందుడుకు వైఖరి ఉంటుందన్న అంచనాలొస్తున్నాయి.
రియల్టీ రంగ షేర్లు గరిష్ఠంగా 4.22 శాతం నష్టపోయాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 3.99 శాతం, సర్వీసెస్ 2.86 శాతం, పవర్ 2.63 శాతం, టెలికం 2.52 శాతం చొప్పున తగ్గాయి. జొమాటో షేర్ విలువ అత్యధికంగా 10.92 శాతం పడిపోగా.. ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లూ పతనమయ్యాయి. ఇక ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్ సూచీలు లాభపడగా.. చైనా, దక్షిణ కొరియా ఇండెక్స్‌లు నష్టపోయాయి. కాగా, విదేశీ సంస్థాగత మదుపరులు ఒక్కరోజే రూ.5,920 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నట్టు స్టాక్ ఎక్సేంజ్ గణాంకాలు చెప్తున్నాయి.
స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలతో ఆయా కంపెనీల మార్కెట్ విలువ కూడా అదే రీతిలో క్షీణించింది. ఈ ఒక్కరోజే మదుపరుల సంపద రూ.7.52 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ. 7,52,520. 34 కోట్లు తరిగిపోయి రూ.4,24,07, 205.81 కోట్లు లేదా 4.90 ట్రిలియన్ డాలర్లకు పరిమితమైంది. బీఎస్ఈలో మొత్తం 4,088 షేర్లు ట్రేడ్ అవగా, 2,881 షేర్లు నష్టపోయాయి. మిడ్‌క్యాప్ 2 శాతం, స్మాల్‌క్యాప్ 1.94 శాతం చొప్పున నిరాశపర్చాయి.