హనుమకొండ, జులై 04: తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. దొడ్డి కొమురయ్య వర్దంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజక వర్గం కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్ అధ్యక్షతన జరిగిన వర్దంతి కార్యక్రమంలో వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కొమురయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు, దొరల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన బహుజన బిడ్డ దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. తెలంగాణ ప్రజలను చైతన్య పరిచింది. బాంచెన్ దొరా నీ కాళ్లు మొక్కుతా అన్న బడుగు జీవుల చేత ఆయుధాలు పట్టించిన వీరుడు అని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు వెట్టిచాకిరి రద్దు కోసం, పన్నులకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. కొమురయ్య బలి దానం తెలంగాణ సాయుధ పోరాటానికి పురుడు పోసిందని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడిన మహనీయులకు గుర్తింపును ఇచ్చి, వారి జయంతులను, వర్ధంతులను అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీదని స్పష్టం చేశారు.