శరీరంలో గుండె, మెదడు ఎంత ముఖ్యమో జీర్ణవ్యవస్థ కూడా అంతే ప్రాధాన్యం కలినది అంటున్నారు వైద్యులు. ఈ రోజుల్లో దేశంలో, ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తున్న పదం ‘గట్ హెల్త్’. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. శక్తి స్థాయులు తగినంత శరీరంలో ఉండటానికి తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థ ఆహారాన్ని అరిగించడానికి మాత్రమే కాదు, రోగనిరోధక శక్తిని అదుపులో ఉంచేందుకూ సాయపడుతుంది. ఆహారం అరగడంలో సమస్యలు, ఊబకాయం, ఆందోళన వంటి సమస్యలు జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల వస్తాయి.
గట్ హెల్త్ అనేది ఫుడ్పైన మాత్రమే కాదు మన అలవాట్లపైనా ఆధారపడి ఉంటుంది. రాత్రి 9 దాటాక తినడం, విపరీతమైన ఆందోళన, డీహైడ్రేషన్, నిద్రలేమి, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం తినడం వంటి అలవాట్లు జీర్ణవ్యవస్థను, జీర్ణక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. చిన్న చిన్న అలవాట్లు దినచర్యలో చేర్చుకుంటే గట్హెల్త్ను ఇంటినుంచే మెరుగుపరుచుకోవచ్చు. తద్వారా మెదడు చురుకుగా పనిచేయడంతోపాటు ఊహించనిదానికంటే మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
జీర్ణవ్యవస్థను మెరుగు పరుచుకోవడానికి ఖరీదైన సప్లిమెంట్స్ వాడాల్సిన పనిలేదు. పెద్దపెద్ద డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరంలేదు అంటున్నారు డైటీషియన్లు. మన సంప్రదాయ వంటకాలైన ఇడ్లీ, దోశ, పెరుగు, పెసరపప్పు కిచిడీ, అరటిపండు, రాజ్మా, పెసరపప్పు, కందిపప్పు వంటివి రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ మనం వండుకోదగ్గవే. వీటితో పాటు పులియబెట్టిన ఆహారాన్ని, తగినంత నెయ్యిని కూడా చేర్చుకోవడం వల్ల గట్ హెల్త్ మెరుగుపడుతుంది అంటున్నారు నిపుణులు.