కోరుట్ల, జూలై 9 : భర్తను భార్య రోకలి బండతో మోది హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. గురువారం కోరుట్ల సర్కిల్ కార్యాలయంలో మెట్పల్లి డీఎస్పీ రాములు వివరాలను వెల్లడించారు. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్యగుట్ట బేడబుగడజంగం కాలనీకి చెందిన ఇప్ప కాశీరామ్ (35)కు అదే కాలనీకి చెందిన సదుల రజనితో 14 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ట్రాక్టర్‌పై కూలికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇద్దరికీ మద్యం సేవించే అలవాటు ఉండటంతో తరచూ కలహాలు చోటుచేసుకునేవి. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని రజని ప్లాన్ వేసింది.
15 రోజుల క్రితం సైతం భర్తపై రజని రోకలి బండతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలై జగిత్యాల దవాఖానలో చికిత్స పొందాడు. బుధవారం కుటు ంబసభ్యులతో క లిసి పోచమ్మ వన భోజనాలకు వెళ్లి, రాత్రి ఇంటికి చే రుకున్నారు. ఫుల్లు గా మద్యం సేవించిన భర్తను చంపేందుకు ఇదే మంచి అవకాశం అని భావించిన రజని పిల్లలను తల్లిగారింటికి పంపించింది. భర్త ఇంటి ముందున్న షెడ్డు కింద నిద్రమత్తులోకి జారిపోగా.. ఇదే అదనుగా భావించిన రజని భర్త తలపై రోకలిబండతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత రజని బంధువుల ఇంట్లో ఉండగా గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రి మరణించడం, తల్లి జైలుకు వెళ్లడంతో చిన్నారులు ప్రస్తుతం అమ్మమ్మ ఇంటిలో ఉంటున్నారు.