ఖైరతాబాద్, జూలై 9 : సోమాజిగూడ డివిజన్లో చెత్త సమస్యపై కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ భర్త విడుదల చేసిన స్టంట్ వీడియో చర్చనీయాంశమైంది. పలు బస్తీల్లో రోజుల తరబడి చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. ఎప్పటికప్పుడు తొలగించాల్సిన బల్దియా సిబ్బంది పట్టించుకోకపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని ఓ బస్తీలో ట్రాన్స్ఫార్మర్ వద్ద వ్యర్థాలు పేరుకుపోగా, అక్కడికి వచ్చిన డివిజన్ మాజీ కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ భర్త శ్రీనివాస్ యాదవ్ పారతో చెత్తను అటూ ఇటూ కదిపాడు.తన అనుచరులతో వీడియో తీయించి, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయవద్దంటూ ప్రజలకు సూచనలు చేశాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దాని వీక్షించిన బస్తీ వాసులు..ప్రజలకు సూచనలు చేస్తూ వీడియో విడుదల చేయడం కంటే.. బల్దియా ద్వారా చెత్తను తొలగించేలా చర్యలు తీసుకుంటే బాగుండేదని మండిపడ్డారు. స్వచ్ఛ వాహనాలు క్రమం తప్పకుండా వచ్చి చెత్తను సేకరిస్తే రోడ్లపై వ్యర్థాలు వేయాల్సిన పరిస్థితి ఉండదన్నారు. గతంలోనూ శ్రీనివాస్ యాదవ్ జలమండలి మ్యాన్‌హోళ్లు శుభ్రం చేయకపోవడంతో అందులో దిగి నిరసన తెలిపిన వైనం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా, వ్యర్థాలు సేకరించని బల్దియా చర్యలను ఖండించాల్సి పోయి.. ప్రజలపై నిందలు వేయడం విమర్శలకు దారి తీసింది. స్థానిక ఎమ్మెల్యే దానంకు తగ్గట్టుగానే..డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు తయారయ్యారంటూ ప్రజలు విమర్శలు గుప్పించారు.