కుభీర్, జూలై 9 : నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో సోయా రైతులు ధర్నా చేపట్టారు. ఓ ప్రైవేట్ కంపెనీ సోయారకం విత్తనాలు సాగు చేసిన రైతులు అవి మొలకెత్తకపోవడంతో ఇటీవల నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆత్మహత్యకు యత్నించగా సదరు కంపెనీ రైతులకు మరిన్ని సోయా బస్తాలను పంపిణీ చేసింది. కాగా సాగు ఖర్చులు, ఎరువులు, కూలీలు, అలికిన ట్రాక్టర్ ఖర్చుల పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ కుభీర్-భైంసా ప్రధాన రహదారిపై గురువారం రైతులు ధర్నా నిర్వహించారు.
నాసిరకం సోయా విత్తనాలను అంటగట్టిన కంపెనీతో పాటు సదరు డీలర్‌పై చర్యలు తీసుకుని నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కుభీర్‌కు వచ్చి ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి వెళ్తున్న నిర్మల్ కలెక్టర్ భవేశ్‌మిశ్రా కారును అడ్డుకున్నారు. కలెక్టర్ రైతుల సమస్యను తెలుసుకుని మొలకెత్తని సోయా విత్తనాల శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపుతామని చెప్పారు. రిపోర్టు ఆధారంగా రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. నష్ట పోయిన రైతులకు తక్షణమే డీలర్ నుంచి విత్తన బస్తాలు, లేదా డబ్బులను అందించేలా చూడాలని ఏవో సారికను ఆదేశించారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు.