తాండూర్ : విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని అదనపు కలెక్టర్ చంద్రయ్య( Additional Collector Chandraiah) సిబ్బందికి సూచించారు. మండలంలోని తహసీల్ కార్యాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన కార్యాలయానికి వచ్చిన సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో కొంచెం సేపు వేచి ఉన్న అనంతరం అధికారులు రావడంతో రికార్డులు తనిఖీ చేశారు. భూభారతిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా కిష్టంపేట గ్రామానికి చెందిన ఆదివాసి కొలవార్కు చెందిన రైతులు అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వెంకయ్య పల్లి శివారులోని సర్వే నెంబర్ 12లో గల 34 ఎకరాల భూమిని మూడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నామని అటవీ శాఖ అధికారులు ఆ భూమిని సాగు చేయ వద్దంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు స్పందించి తమకు పోడు పట్టాలు వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించి స్థానిక అధికారులతో విచారణ చేయిస్తానన్నారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ జ్యోష్న, సిబ్బంది ఉన్నారు.