బన్సీలాల్‌పేట్/హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రెండు సార్లు కరోనాబారిన పడ్డాడు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయి. ప్రైవేటు దవాఖానకు వెళ్తే రూ.లక్షలు ఖర్చవుతాయన్నారు. అత్యవసరదశలో అక్కున చేర్చుకొన్న గాంధీ దవాఖాన.. ఆర్నెల్ల పాటు మెరుగైన చికిత్స అందించి, పూర్తి ఆరోగ్యంతో ఇంటికి పంపి ంచింది. హైదరాబాద్‌లోని రామంతాపూర్ కు చెందిన సురేశ్‌కుమార్(33) స్థానిక బార్ లో పనిచేస్తున్నాడు. అతడికి గత ఏప్రిల్‌లో కరోనా సోకి గాంధీలో చేరాడు. 14 రోజులు చికిత్స తీసుకొని ఇంటికి వెళ్లాడు. జూన్‌లో రెండోసారి వైరస్ సోకింది. ప్రైవేట్ దవాఖానలో చేరి ఉన్న డబ్బంతా పోగొట్టుకొన్నా డు. చివరికి, బతకడం కష్టమని డాక్టర్లు షాకిచ్చారు. ఆరోగ్యం క్షీణించిన దశలో గాంధీ దవాఖానలో చేరాడు. అక్కడ ఐసీయూలో పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, అనస్థీషి యా, రేడియాలజీ, ఇతర విభాగాల వైద్యుల బృందం పలుమార్లు వివిధ రకాల పరీక్షలు చేశారు. ఊపిరితిత్తులకు వెళ్లే నాళాల్లో ఇబ్బందులు తలెత్తాయని గుర్తించి సీటీ సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ రవీందర్, ఇతర వైద్యులబృందం ఆపరేషన్ నిర్వహించింది. అది విజయవంతమై శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తొలగిపోయాయి. కొవిడ్ కూడా నియంత్రణలోకి వచ్చింది. అన్ని రకాలుగా కోలుకున్న సురేశ్ సంపూర్ణ ఆరోగ్యంతో శనివారం డిశ్చార్జి అయ్యాడు.
గాంధీ దవాఖాన పునర్జన్మనిచ్చింది
గాంధీ దవాఖానలో నైపుణ్యం, అనుభవం ఉన్న డాక్టర్లు ఉన్నారు. నాలాంటి పేదవాడికి ఉచితంగా, మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇది దేవాలయం లెక్క. సమయానికి నాణ్యమైన భోజనం, వార్డుల్లో పారిశుధ్యం, రోగులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించటం ఆరు నెలల్లో గమనించాను. నన్ను ఆరోగ్యంగా తీర్చిదిద్దిన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు, డాక్టర్లు, నర్సులు, ఆయాలు, సిబ్బందికి కృతజ్ఞతలు.
మీ ప్రాణాలకు భరోసా మాది
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే నిరుపేదలను కాపాడటం మా విధి, ధర్మం. ప్రాణాలతో కొట్టుమిట్టాడే రోగిని బతికించామంటే ఆ రోజు మాకు కలిగే సంతోషం మాటల్లో చెప్పలేం. ఆరు నెలలుగా క్రిటికల్ కండిషన్లో ఇక్కడ చికిత్స తీసుకొన్న సురేశ్ పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి కావటం నాతో పాటు మా స్టాఫ్ అందరికి ఆనందంగా ఉంది. అతడికి బయట చికిత్స చేస్తే రూ.కోటి దాకా ఖర్చయ్యేది.