– తల్లిదండ్రులకు డీఈఓ బి.నాగలక్ష్మి సూచనలు
బూర్గంపహాడ్, ఏప్రిల్ 23 : వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలను తల్లిదండ్రులు బయట తిరగనీయకుండా చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్(ప్రైమరీ స్కూల్)తో పాటు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ యదుసింహరాజుతో కలిసి పాఠశాలలో వసతులు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. టాయిలెట్స్, కిచెన్ షెడ్, తరగతి గదులను తనిఖీ చేశారు. అనంతరం మండల ప్రాథమిక పాఠశాల(ప్రైమరీ స్కూల్)లో తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వేసవి సెలవులు కావడంతో పిల్లలను ఇంటి పట్టున ఉంచి కొద్దిసేపు చదివించాలని, బయట తిరగకుండా చూడాలని, సెల్ఫోన్, టీవీ వంటి వాటికి దూరంగా ఉంచాలని సూచించారు. అంతేకాకుండా ఈత పేరుతో సమీపంలోని వాగులు, నదుల వద్దకు పోనీయకుండా తల్లిదండ్రులు పిల్లలను నిత్యం పర్యవేక్షించాలన్నారు. అనంతరం పిల్లలకు ప్రోగెస్ రిపోర్టులు అందించి మార్కుల్లో ప్రతిభ కనబర్చినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శేషగిరిరావు, కేజీబీవీ స్పెషలాఫీసర్ సుశీల, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.