Puneeth Rajkumar | Health tips | జిమ్ చేయడం నేటి యువతకు ఒక ఫ్యాషన్‌గా మారింది. జిమ్, జాగింగ్, రన్నింగ్, వాకింగ్ వంటివి ఆరోగ్యానికి మంచివే. అయితే, మితిమీరిన వ్యాయామం లేదా సరైన పద్ధతిలో చేయని కసరత్తులు తీవ్ర అనర్థాలకు దారితీస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తుల వయసు, ఆరోగ్య నేపథ్యం తదితర అంశాల ఆధారంగానే వ్యాయామం చేయాల్సి ఉంటుందంటున్నారు. అన్ని రకాల వ్యాయామాలు అందరూ చేయడం కూడా సరికాదని చెబుతున్నారు. బీపీ (రక్తపోటు), షుగర్ (మధుమేహం), మానసిక ఒత్తిడి తదితర దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు పరిమితంగానే వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు జిమ్ వంటి తీవ్రమైన వ్యాయామాలకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ( Puneeth rajkumar ) శుక్రవారం బెంగళూరులోని తన ఇంట్లో జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురవ్వడం.. అనంతరం మరణించడం వంటి సంఘటనల నేపథ్యంలో.. జిమ్ చేయడం వల్ల గుండెపోటు వస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుండెపై ‘జిమ్’ ప్రభావం ఏమేరకు ఉంటుంది? అనే అంశంపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం…
జిమ్ లేదా ఇతర ఏదేని వ్యాయామం చేసినప్పుడు గుండెపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా జిమ్, రన్నింగ్, జాగింగ్ వంటివి చేసినప్పుడు గుండె వేగం, బీపీ పెరుగుతాయి. జిమ్‌లో మోతాదుకు మించి కసరత్తు చేయడం వల్ల ‘హార్ట్‌బీట్ రిథమ్ డిస్టబ్’ అవుతుంది.
ఆరోగ్యవంతుల్లో సాధారణ హార్ట్‌బీట్ అనేది 60 నుంచి 90 మధ్యలో ఉంటుంది. జిమ్ లేదా ఇతర వ్యాయామాలు చేసినప్పుడు హార్ట్‌బీట్ అనేది పెరుగడం సహజం. ఇలాంటి సమయాల్లో గుండె వేగం అనేది 120 నుంచి 140 వరకు వెళ్తుంది. వ్యాయామం తరువాత 3 నిమిషాల్లో తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటుంది. వ్యాయామం చేసినప్పుడు హార్ట్‌బీట్ అనేది 140 దాటినా లేక వ్యాయామం తరువాత 3 నిమిషాల్లో హార్ట్‌బీట్ సాధారణ స్థాయికి చేరకపోయినా సదరు వ్యక్తికి గుండె సమస్యలున్నట్టు అనుమానించాలి. సామర్థ్ధ్యానికి మించి తీవ్రమైన వ్యాయామం చేస్తే హార్ట్‌బీట్ 140 దాటి ఒక్కసారిగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.
సాధారణంగా జిమ్ చేసే సమయంలో గుండెపోటు రావడానికి పలు కారణాలున్నాయి. అందులో ప్రధాన కారణం.. హైపర్ట్రోఫిక్ అబస్ట్రక్టివ్ కార్డియోమయోపతి (హెచ్వోసీఎం). ఇది వంశపారంపర్యంగా ఉండే గుండె జబ్బు. ఈ జబ్బు ఉన్నవారికి 50 ఏండ్ల వయసు వచ్చినా ఎలాంటి లక్షణాలు బయటపడవు. సాధారణ జీవితమే గడుపుతారు. శారీరక శ్రమ అధికమైనప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు మాత్రమే లక్షణాలు బయట పడతాయి. ఎక్కువగా జిమ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేసినప్పుడు హఠాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఈ సమస్య ఉన్నవారిలోనే అధికం. హెచ్ఓసీఎం ఉన్నవారిలో చిన్నతనంలోనే గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి. ఈ సమస్య ఎక్కువగా పురుషుల్లోనే కనిపిస్తుంది. మహిళల్లో చాలా తక్కువ. ఇది కాకుండా ఊబకాయం, హైపర్‌టెన్షన్, అన్‌కంట్రోల్ డయాబెటిక్ వంటి సమస్యలున్న వారికి సైతం వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె సమస్యలు రావచ్చు.
ఏదేని వ్యాయామం చేసే ముందు వామప్, వ్యాయామం పూర్తైన తరువాత కూల్‌డౌన్ ఎక్సర్సైజ్లు తప్పనిసరి. వామప్ అంటే శరీరాన్ని నెమ్మదిగా వేడెక్కించడం. ఇది చేయకుండా నేరుగా వ్యాయామం చేస్తే శరీరం ఉన్నట్లుండి ఒక్కసారిగా వేడెక్కితే అది విపరీత పరిణామాలకు దారితీస్తుంది. ఇక వ్యాయామం ముగిసిన తరువాత చాలా మంది టైమ్ అయిపోయిందని లేదా అర్జంటుగా వెళ్ళాలని వెంటనే జిమ్ నుంచి వెళ్లిపోతారు. ఇది ప్రమాదకరం. వ్యాయామంతో వేడెక్కిన శరీరాన్ని నెమ్మదిగా చల్లబర్చాలి. అందుకోసం కూల్‌డౌన్ ఎక్సర్సైజ్ తప్పనిసరి.
హెచ్వోసీఎం, మధుమేహం, ఊబకాయం, బీపీ, ఒత్తిడి సమస్యలు ఉన్న వారికి గుండెపోటు రిస్క్ ఎక్కువ. ఈ సమస్యలున్న వారు తక్కువ స్థాయిలోనే జిమ్ లేదా ఇతర వ్యాయామాలు చేయడం మంచిది.
వాస్తవానికి మన దగ్గర ఉన్న చాలా జిమ్‌లలో నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించరు. ప్రతి జిమ్‌లో కచ్చితంగా ఏఈడీ (ఆటోమేటడ్ ఎక్స్టర్నల్ డీ-ఫిబ్రిలేటర్), సీపీఆర్(కార్డియో పల్మనరీ రెసాసిస్టేషన్) పరికరాలు ఉండాలి. వీటి వల్ల ఎవరైనా వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె సమస్యలకు గురైతే రోగులను దవాఖానకు తరలించే వరకు ప్రమాదపుటంచులకు వెళ్ళకుండా కాపాడవచ్చు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం నిష్ణాతులైన శిక్షకులు జిమ్‌లో ఉండాలి. వారి పర్యవేక్షణలోనే వ్యాయామం చేయాలి. శిక్షకులకు ఏఈడీ, సీపీఆర్ ఆపరేటింగ్పై పూర్తి అవగాహన ఉండాలి.
మితిమీరిన వ్యాయామం వద్దు
చాలా మంది యువకులు మితిమీరిన వ్యాయామం చేస్తుంటారు. ఇది ప్రమాదకరం. రక్తపోటు తీవ్రస్థాయికి చేరి గుండె, మెదడులో బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్స్ట్రోక్ రావచ్చు. యువకుల్లో శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువైతే, గుండెపోటు రావడానికి హెచ్వోసీఎం కామన్ కాజ్‌గా చెప్పవచ్చు.
– డా.ఇమాముద్దీన్, కార్డియాలజీ విభాగాధిపతి ఉస్మానియా హాస్పిటల్
వారు జిమ్ చేయకపోవడమే మేలు
సాధారణంగా గుండె జబ్బులు ఉన్నవారు జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేయకపోవడం మంచిది. వాకింగ్ వంటి సున్నితమైన వ్యాయామాలు చేయాలి. బీపీ, షుగర్ వంటి సమస్యలున్నవారు కూడా తక్కువ స్థాయిలో వ్యాయామాలు చేయాలి.
– డాక్టర్ సాయి సతీష్, కార్డియాలజీ ప్రొఫెసర్, నిమ్స్ హాస్పిటల్
ఒత్తిడితో చేటే
మానసిక ఒత్తిడి గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. దీంతో పాటు ఆహారం తీసుకోవడంలో సమయపాలన పాటించకపోవడం కూడా గుండెపోటుకు కారణంగా చెప్పవచ్చు. ఎవరైనా జిమ్‌కు వెళ్లే ముందు కచ్చితంగా 2డి-ఎకో వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఇది సాధారణంగా ఉంటేనే జిమ్‌కు వెళ్లాలి.
– డాక్టర్ సాయి సుధాకర్, చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పునీత్ రాజ్ కుమార్ పై 400 కోట్ల పెట్టుబడులు.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
Puneeth rajkumar movies పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా
గతేడాది చిరంజీవి సర్జా.. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినిమాకు చీకటి రోజులు