మీ ఇంటికొస్తే ఏమిస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ వైఖరి. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల మద్దతును తీసుకొంటూ.. రాష్ర్టాల స్థాయిలో మాత్రం మిత్రపక్షాలను నట్టేట ముంచుతున్నది. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఒక్కచోట చేర్చి ఇండి కూటమి అని ఓ జట్టు కట్టిన కాంగ్రెస్.. అసలు ఆ కూటమికి విధివిధానాలేంటో, దశదిశ ఏంటో కూడా గుర్తించడంలేదు. మిత్రపక్షాలను చెప్పుకొంటారు.. జాతీయస్థాయిలో ఒకలా, రాష్ట్ర స్థాయిలో ఒకలా వ్యవహరిస్తారు. ప్రాంతీయ పార్టీలు కొన్ని పరిస్థితుల ప్రభావం రీత్యా కాంగ్రెస్ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు మారుతూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీనే కప్పల తక్కెడ రాజకీయాలకు పాల్పడుతున్నది. పొత్తు ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నది. ఈ నేపథ్యంలో అనైతిక పొత్తులు, అడ్డగోలు ఉల్లంఘనల రాజకీయాలకు అతీతంగా మూడో కూటమి అంశం తెరపైకి వస్తున్నది.
ఇటీవలి తమిళనాడు ఎన్నికల తీర్పు సిరా ఇంకా ఆరనేలేదు, కానీ అప్పుడే భారత రాజకీయాల్లో ఒక పెను మార్పు మొదలైంది. ఇది ఇండి కూటమి పునాదులనే కదిలించేటట్టు ఉన్నది. రాజకీయ అవకాశవాదానికి పరాకాష్టగా, కాంగ్రెస్ తన పాత మిత్రపక్షమైన డీఎంకేను కాదని, రెండో మూడో మంత్రి పదవులకోసం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) తో చేతులు కలిపింది. టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ మెజారిటీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఈ టైమ్‌లో కాంగ్రెస్ తన విధేయతను మార్చుకోవడం కేవలం ఒక ప్రాంతీయ ఎత్తుగడ మాత్రమే కాదు.. తాను కష్టపడి కట్టిన ఇండి కూటమిని తానే కూల్చేస్తుట్టుగా సంకేతం.
దశాబ్దాలుగా దక్షిణ భారతంలో కాంగ్రెస్‌కు డీఎంకే కేవలం మిత్రపక్షమే కాదు, అది ఒక ఊపిరి. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడల్లా డీఎంకే ఒక కొండలా అండగా నిలబడింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, రాహుల్ గాంధీని బీజేపీ టార్గెట్ చేసినప్పుడు… డీఎంకే, కమ్యూనిస్టులే పార్లమెంట్లో గొంతెత్తారు. 2జీ స్పెక్ట్రమ్ కేసులో తమ నాయకులు రాజా, కనిమొళి జైలుకు వెళ్లినా డీఎంకే వెనకడుగు వేయలేదు. కానీ మిత్రపక్షం డీఎంకేకు వెన్నుపోటు పొడవడం అంటే కూటమి ఆశయాలు మంటగలిసిపోయినట్టే.
ఇది ఒక్క తమిళనాడులోనే జరుగుతున్నది కాదు. తన సొంత గూటి పక్షులనే వేటాడటం కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది. కేరళంలో పేరుకే ఇండి కూటమి. కానీ క్షేత్రస్థాయిలో లెఫ్ట్ ఫ్రంట్‌తో కొట్లాటలు ఆపడంలేదు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోటీ చేసి వ్యతిరేక ఓట్లను చీల్చుతున్నది. ఇది బీజేపీని ఓడించడం కోసం కాదు. ప్రాంతీయ శక్తులు ఎదగకుండా ఆపే కుట్రలా ఉన్నది. మరీ దారుణం ఏందంటే, ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జైలులో వైద్య సాయం అందకుండా చేసి అంతమొందించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కూటమి భాగస్వామిగా మద్దతు ఇవ్వాల్సింది పోయి, కాంగ్రెస్ మౌనంగా ఉండి పరోక్షంగా బీజేపీకి సహకరించింది. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల డీఎన్ఏ ఒకటే. ప్రాంతీయ పార్టీలను బొందపెట్టి తామే ఉండాలని ఆరాటం. కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీనే కూల్చేస్తున్నది. తమిళనాడులో కాంగ్రెస్ చర్య.. ఇండి కూటమి శవపేటికపై కొట్టిన చివరి మేకు అని చెప్పవచ్చు.
ఒకపక్క కాంగ్రెస్ ద్రోహం చేస్తుంటే, మరోపక్క తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి పక్షపాత రాజకీయం చేస్తున్నారు. అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించకుండా కాలయాపన చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఒక ‘కొత్త గాలి’. పాత తరం ద్రావిడ రాజకీయాల నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నిరూపించారు. ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం అతిపెద్ద పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలి. కానీ రిసార్ట్ పాలిటిక్స్‌కు, గుర్రపు బేరాలకు గవర్నర్ అవకాశమిస్తూ ప్రజాస్వామ్య గొంతు నొక్కుతున్నారు.
ఇండి కూటమి పతనం అనేది కాంగ్రెస్ స్వయంకృతాపరాధమే. జాతీయ పార్టీలు ప్రాంతీయ శక్తులను కేవలం పావులుగా వాడుకుంటున్నాయి. తమిళనాడులో కింగ్ మేకర్ అవ్వాలనే ఆశతో తన పాత మిత్రులను వదిలేసిన కాంగ్రెస్, జాతీయ స్థాయిలో తన విశ్వసనీయతను పూర్తిగా పోగొట్టుకున్నది. అందుకే ఇప్పుడు దేశంలోని బలమైన ప్రాంతీయ శక్తులన్నీ కాంగ్రెస్ రహిత, బీజేపీ రహిత రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాయి. మమతా బెనర్జీ ఇప్పటికే స్టాలిన్, అఖిలేశ్ యాదవ్‌తో మాట్లాడుతున్నారు. ‘మూడో ఫ్రంట్’కు ప్రాణం పోస్తున్నారు.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ) దాసోజు శ్రవణ్