శా॥ అన్నా వీరుడ! ఖడ్గ తిక్కన! సమిద్య జ్ఞావనిం ద్వేష ధా
య్యోన్నీల జ్వలితోపచాయ్యమునకున్ వ్యూహీకృతారాతి, వి
ష్పన్నానీకిని ద్వత్కఖడ్క శితశస్త్ర స్రుక్సమానీతమౌ
సాన్నాయ్యంబు నొనర్పలెమ్ము రణశాస్త్ర ప్రౌఢిమద్యజ్వువై!
ఇది ఒద్దిరాజు సోదరులు రచించిన ‘ఖడ్గ తిక్కన’ పద్య కావ్యంలోనిది. వీరు తెలంగాణలోని పాత మహబూబాబాద్ తాలూకా ఇనుగుర్తి గ్రామ వాస్తవ్యులు. తెలుగులో మొదటి పత్రిక ‘తెనుగు’ను 1922 ఆగస్టు 27న మద్రాసు నుంచి తెచ్చిన ప్రత్యేక ముద్రణా యంత్రం ద్వారా స్వయంగా వారే ప్రచురించి కొనసాగించారు. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు ఒక సందర్భంలో ఒద్దిరాజు సోదరుల గురించి రాస్తూ ఇలా అన్నారు: “ఒద్దిరాజు వారు సుమారు పది భాషలలో పాండిత్యం గలవారు. వారు తేనెటీగల వలె ఎక్కడ విద్య లభించితే అక్కడ.. స్టేషన్ మాస్టర్ కావచ్చు, మెకానిక్కు కావచ్చు, వైద్యుడు కావచ్చు అమితమైన విద్యాతృష్ణతో గురు శుశ్రూష వల్లనో, ధనము దక్షిణగా ఇచ్చియో, విద్యనిచ్చి విద్యనేర్చియో అదొక సాధనగా, తపస్సుగా కొనసాగించినారు”.
ఇక పద్యం విషయానికి వస్తే… కాటమరాజుపై యుద్ధం ప్రకటించిన సందర్భంలో ఖడ్గతిక్కనతో అంటున్న మాటలు. ‘అన్నా వీరుడా ఖడ్గతిక్కనా! నువ్వు చెప్పిన యుద్ధమనే భగభగ మండుతున్న యజ్ఞంలో శత్రువుల శస్ర్త్ర్తాలను ఒక వ్యూహం పన్ని వాటినన్నిటినీ నైవేద్యంగా యజ్ఞ గుండంలో వేయాలి. ఆ పనిని రణశాస్త్రంలో నేర్పరివైన నువ్వు మాత్రమే చేయగలవు. ఆ యజ్ఞం చెయ్యి!’ పద్యంలో వారు ప్రయోగించిన సమాసాలు కొంత వైవిధ్యం గానూ, పద సమ్మేళనం కొంత క్లిష్టంగానూ కనిపిస్తుంది.
రణ శాస్త్రంలో ప్రౌఢిమ కలిగి యుద్ధ యజ్ఞ అధ్వర్యుడవై నీ ప్రతాపం చూపించు. ధాయ+ ఉన్నీల+జ్వలిత+ ఉపచాయ్యము (యాగాగ్నిలో ఉపయోగించే పేరు) లాంటి దీర్ఘ సమాసంతో పాటు అర్థం చేసుకోవడానికి కష్టమైన మరో దీర్ఘ సమాసం ‘విష్పన్నానీకిని…. శిత శస్త్ర’- కంపిస్తున్న శత్రుమూకల శస్త్రములనే స్రుక్కులను వేసి యజ్ఞం మరింత జ్వలించే విధంగా అని నేనర్థం చేసుకుంది. వీరి భావన గాఢంగానూ, చిత్రం గానూ ఉంటుంది. ఖడ్గ తిక్కన ఇతివృత్తం చారిత్రాత్మికం. వీర రసం ప్రధానంగా ఉన్నప్పటికీ కరుణరసం అంతర్లీనంగా ఉంటుంది. స్వాతంత్రోద్యమం తరువాత ధర్మబోధ దేశభక్తి ప్రేరేపితంగా ఈ రచన కొనసాగింది.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ