బెంగళూరు, మార్చి 4 : కర్ణాటకలో నాయకత్వం మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగుతున్న తరుణంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం నాడిక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలుసుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టకుండా ఎవరూ అడ్డుకోలేరంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ ప్రకటించిన నేపథ్యంలో ఖర్గేతో డీకే సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాను మర్యాదపూర్వకంగా ఖర్గేను కలుసుకున్నట్టు డీకే విలేకరులకు వివరించారు. బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ శంకుస్థాపనకు ఖర్గేను ఆహ్వానించినట్టు ఆయన చెప్పారు.
కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం వెంటాడుతూనే ఉంది. సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ఈ కుంభకోణాన్ని సీబీఐతో దర్యాప్తుం చేయించాలని మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ముడా నుంచి 14 ఫ్లాట్లను అక్రమంగా పొందారన్న ఆరోపణలపై సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతిలకు లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది.