Karimnagar Corporation | కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 04 : కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు డీలిమిటేషన్ను శాస్త్రీయబద్ధంగా చేయలేదని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ విమర్శించారు. బుధవారం స్థానిక 37వ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 60 డివిజన్లను 66 డివిజన్లుగా శాస్త్రీయత లేకుండా ముసాయిదా తయారు చేశారని ఆరోపించారు. ఇందుకోసం టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు చివరకు ఐఏఎస్ అధికారులను సైతం తప్పుదారి పట్టించారని ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారో అధికారులు చెప్పాలన్నారు. డివిజన్లలో లేని ఓట్లను కలిపి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు.
సాంకేతికత ఎంత పెరిగినా డివిజన్ల బౌండరీస్ సరిగ్గా ఏర్పాటు చేయలేదన్నారు. దీనిపై కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పాలన్నారు. మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన ముసాయిదా జాబితా చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు నగరంపై పట్టు లేనట్టుగా కనిపిస్తోందన్నారు. అధికారులు తయారు చేసిన తప్పుడు ముసాయిదా జాబితాపై ఐఏఎస్ అధికారులు గుడ్డిగా ఎలా సంతకం చేశారో అర్థం కావడం లేదన్నారు. ముసాయిదా జాబితాలో పారదర్శకత కొరవడిందన్నారు. వంద ఫీట్ల రోడ్డు.. 60 ఫీట్ల రోడ్లు హద్దులుగా డివిజన్లను విభజించాల్సి ఉన్నా ఎక్కడా పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ గొప్ప నగరంగా అభివృద్ధి చెందిందన్నారు.
2020 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 13 గెలిస్తే కాంగ్రెస్ సున్నా స్థానాలకు పరిమితమైందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సున్నా బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని ఘనత కాంగ్రెస్దన్నారు. శాస్త్రీయంగా ఉన్న డివిజన్లను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు ముసాయిదాపై కలెక్టరును కలిసి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతామని.. స్పందన లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
బల్దియాపై ఎగిరేది బీఆర్ఎస్ జెండానే..
ఈ ఎన్నికల్లో బల్దియాపై ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అన్నారు. నగరపాలక సంస్థ విడుదల చేసిన జాబితాలో ప్రతీ డివిజన్లో 5000 ఓటర్లు ఉన్నట్టు చూపించినారని వారు చూపించిన ఇంటి నెంబర్ల ప్రకారం ఓటర్ లిస్టును పరిశీలించగా కొత్తగా వారు తెలిపిన 20వ డివిజన్లో 3000 ఓటర్లు, 63వ డివిజన్లో 2000 ఓట్లు మాత్రమే ఉన్నాయన్నారు. 66 డివిజన్లో వారు చూపించిన ఓటర్ లిస్టుకు ఇప్పుడు కరీంనగర్ అందుబాటులో ఉన్న ఓటర్ లిస్టుకు ఎక్కడ కూడా పొంతన కలవడం లేదన్నారు. ప్రభుత్వం మరి అధికారులు తూతూ మంత్రంగా రాత్రికి రాత్రి వారికి నచ్చిన విధంగా డివిజన్లను డిలిమిటేషన్ చేసి ప్రజలను, నాయకులను అయోమయానికి గురి చేస్తున్నారని.. అధికారులపై వెంటనే చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం పొందిన ఏదైనా ఏజెన్సీతో డీలిమిటేషన్ ప్రక్రియ చేపించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్ సుధాగోని మాధవి కృష్ణ ఏదుల రాజశేఖర్ నాంపల్లి శ్రీనివాస్, నక్క పద్మ, కృష్ణ, సదానంద చారి బీఆర్ఎస్ నాయకులు గడ్డం ప్రశాంత్ రెడ్డి, ఆరె రవి గౌడ్, కొత్త అనిల్ కర్రె అనిల్ దుడ్డేల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్లో సిసోడియా, సత్యేంద్రకు ఏసీబీ సమన్లు
MLC Kavitha | కేసీఆర్ను బద్నాం చేసేందుకే నోటీసులు.. రేవంత్ సర్కారుపై కవిత ఫైర్..
Karimnagar | తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. నగదు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన దొంగలు