నీలగిరి, నవంబర్ 24 : ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులకు మినహాయింపు ఉండదని, ఒకవేళ అత్యవసరమైతే ముందుగానే అనుమతి తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా ప్రజావాణి కార్యక్రమానికి నిర్దేశించిన సమయంలోగా హాజరు కావాలని ఆదేశించారు. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తాను ర్యాండంగా తనిఖీ చేయనున్నట్లు చెప్పారు.
అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికలను మండల ప్రత్యేక అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పర్యవేక్షించాలని, అవసరమైతే ఎంపీడీఓ కార్యాలయంలో కూర్చొని ఎన్నికలు సవ్యంగా జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, ఆర్డీఓలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. కాగా సోమవారం ప్రజావాణికి మొత్తం 70 ఫిర్యాదులు రాగా జిల్లా అధికారులకు 39, రెవెన్యూ శాఖకి 31 వచ్చాయి. అనంతరం కార్మికుల బీమా పెంపుపై రూపొందించిన గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, ఆర్డీఓలు వై.అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.