కంఠేశ్వర్, ఏప్రిల్ 10 : వివిధ పరిస్థితుల కారణంగా సమాజంలో దుర్భర స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న చేయూతను సద్వినియో గం చేసుకుని గౌరవప్రదంగా జీవించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. కలెక్టరేట్లో జిల్లా న్యాయం సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం మినీ మాడ్యూల్ క్యాంప్ నిర్వహించారు. దాతల సహకారంతో పలువురికి కుట్టుమిషన్లు, ప్రభుత్వ బాలికల పాఠశాలలు, డిచ్పల్లి మానవతా సదన్, కస్తూర్బా విద్యాలయాలకు శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు పంపిణీ చేశారు.
లేబర్ డిపార్ట్మెంట్ తరపున అసంఘటిత రంగ కార్మికులకు గుర్తింపు కార్డులను, మెప్మా ఆధ్వర్యంలో 21 స్వయం సహాయక సంఘాలకు రూ.2.50 కోట్ల విలువ గల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, సీపీ సాయిచైతన్యతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు, సెక్స్‌వర్కర్లు, అసంఘటితరంగ కార్మికుల ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి, పేదరిక నిర్మూలనకు పాటుపడాలనే డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఈ మాడ్యూల్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఆయా వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న తోడ్పాటును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకున్నప్పుడే, చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలకు సార్థకత చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్‌రెడ్డి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్గౌడ్, వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.