కరీంనగర్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వేల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటికే యూనిట్లను పంపిణీ చేసిం ది. తాజాగా మంగళవారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మరోసారి భారీ సంఖ్యలో వాహనాలను అం దజేసింది. 393 మంది లబ్ధిదారులకు 202 యూనిట్లను ఇచ్చింది.
ఇందులో 76 హార్వెస్టర్లు, 15 డీసీఎం లు, 10 వరి నాటుయంత్రాలు, నాలుగు టిప్పర్లు, మూడు మినీ బస్సులు, రెండు టాటా హిటాచీ ఎక్స్కవేటర్లు, ఒక స్కార్పియోతోపాటు 79 వ్యక్తిగత గూడ్స్ వాహనాలు ఉన్నాయి. బీసీ సంక్షేమశాఖ మంత్రి గం గుల కమలాకర్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ లబ్ధిదారులకు వాహనాల తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడక ముందే కేసీఆర్ ఏర్పర్చుకున్న సంకల్పాన్ని ఇప్పుడు నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 73 లక్షల మంది రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని, ఇప్పుడు 17 లక్షల దళిత కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా దళితబంధును అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ పథకానికి 2022-23 బడ్జెట్లో రూ.17,800 కోట్లు కేటాయించడంపట్ల హర్షం తెలిపారు. నిన్నా మొన్నటి వరకు డ్రైవర్లుగా, క్లీనర్లుగా ఉన్న దళితులను దళితబంధు ఓనర్లుగా మారుస్తున్నదని, ఇదంతా సీఎం కేసీఆర్ చలవేనని కొనియాడారు. మంత్రి గంగుల కమలాకర్ మా ట్లాడుతూ.. 70 ఏండ్ల దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధాని ప్రవేశపెట్టని పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు.
ఉద్యమ సమయంలోనే దళిత పాలసీ: బీ వినోద్‌కుమార్
తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచన చేశారని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. అందులో భాగంగానే దళిత బంధు పథకం ఆవిర్భవించిందన్నారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడే 2002లో దళిత పాలసీని తెచ్చిందని గుర్తుచేశారు. ఎన్నికల కోసమే ఈ పథకం తెచ్చిందని, అమలు చేయబోరని ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన వాళ్లు ఇపుడు ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేతకాని, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, టీఆర్ఎస్ హుజూరాబాద్ ఇంచార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.