హైదరాబాద్, జులై 25 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైందనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించాలని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్‌రావు సూచించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నేతలు సన్నబియ్యం పంపడంపై ఆయన మండిపడ్డారు. శనివారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు సన్నబియ్యంపై డ్రామాలు కట్టిపెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సన్న వడ్లకు ఇస్తామన్న బోనస్ ఏదని ప్రశ్నించారు.
ఉచితంగా ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్లకు ఇప్పుడు రూ. 6లక్షలు కట్టాలని పేదలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులను కాంగ్రెస్ పూర్తిగా మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్ కాస్తా జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మారిందని విమర్శించారు. ప్రభుత్వ మోసాలను ఎత్తిచూపుతూ త్వరలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసనకు దిగుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో, గ్యారెంటీ కార్డులు, డిక్లరేషన్లను రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమారకు కొరియర్ ద్వారా పంపించనున్నట్టు తెలిపారు. వాటిని ఎందుకు ఎగ్గొట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్, పల్లయ్య తదితరులు ఉన్నారు.