కాలం అలా గడుస్తుండగానే సిద్ధార్థుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం కలిగి బుద్ధుడిగా మారినట్టు (పోలికకు మన్నించాలి) నేను చుట్టూ ఉన్న పరిసరాలను, పరిస్థితులను, మనుషుల స్వభావాలను మెల్లమెల్లగా గమనిస్తూ అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. 1977 ఆఖరి మూడు నెలల నుంచి 1983 మే దాకా నా జీవిత ప్రయాణంలో పుస్తకాలతో నా స్నేహం మొదలైంది. ఈ సమయంలో నేను చాలా పుస్తకాలు చదివాను, రచనా వ్యాసంగం మొదలు పెట్టాను కూడా!
బాల్యం నుంచీ క్లాసు పుస్తకాలే కాక కథల పుస్తకాలు కూడా నేనూ, అక్కా విరివిగా చదివేవాళ్లం. మా మానసిక ఎదుగుదలలో ఆ పుస్తకాల పాత్ర ఎంతో ఉంది. కొద్దో గొప్పో సంస్కారం, మనుషుల్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకునే అవగాహన, మాట్లాడే తీరు మాకు నేర్పింది ఆ పుస్తకాలే. మా చిన్నప్పట్నుంచీ అమ్మ చాలా పత్రికలు కొని పోస్టులో తెప్పించేది. వాటిలో వచ్చిన సీరియల్స్ అన్నిటినీ బ్రౌన్ కలర్ అట్టలు వేసి కుట్టి శ్రద్ధగా దాచిపెట్టింది. అలా రంగనాయకమ్మ ‘కూలిన గోడలు, బలిపీఠం, స్త్రీ, స్వీట్ హోమ్, కోడూరి కౌసల్యా దేవి ప్రేమనగర్, చక్ర సిరీస్- అంటే చక్రభ్రమణం, చక్రనేమి, చక్రవాకం, ధర్మచక్రం, ఇంకా శంఖుతీర్థం, శాంతి నికేతన్, ద్వివేదుల విశాలాక్షి ‘మారిన విలువలు’, చక్కిలం విజయలక్ష్మి ‘మరుభూమిలో మల్లెతీగలు’, కొమ్మూరి వేణుగోపాల రావు ‘హౌస్ సర్జన్, పెంకుటిల్లు, ఒకే రక్తం ఒకే మనుషులు’, కప్పగంతుల మల్లికార్జునరావు ‘వైకుంఠపాళి’, శ్రీధర ‘రాగవిపంచి’… ఇలా ఎన్నెన్నో నవలలు చదివాం. ఇక యద్దనపూడి నవలలైతే చెప్పనక్కర్లేదు. మత్తుమందులాగే! వాటికి అడిక్ట్ అయ్యేవాళ్లం.
వాకిట్లో ఎవరైనా పిలిచినా, వంటింట్లోంచి అమ్మ పిలిచి ఏదైనా పని చెప్పినా ఆమె నవలను వదిలి వెళ్లబుద్ధి అయ్యేది కాదు. అయితే యద్దనపూడి సులోచనారాణి నవలలు మరీ అంత పాతవి కావు. మేము నవలలు చదువుతున్నప్పటి రోజుల్లోనే ఆంధ్రజ్యోతిలో ‘ప్రేమలేఖలు, మధుర స్వప్నం, పార్థు’ లాంటి నవలలు సీరియల్స్‌గా వచ్చాయి. ఆమె నవలల్లో ‘మీనా’ యువలో ఒకటి రెండు భాగాలు చూసిన జ్ఞాపకం. ‘కీర్తి కిరీటాలు ‘స్వాతి’ మంత్లీలో వచ్చేది. 1977 వచ్చేటప్పటికే అమ్మ పోస్టులో పత్రికలు తెప్పించడం మానేసింది. మాకు న్యూస్ పేపర్ ఏజెంటు ఇంటికి వీక్లీలు తెచ్చి ఇచ్చేవాడు. జ్యోతి, స్వాతి, యువ లాంటి మంత్లీలు వచ్చేవి కావు. ఎప్పుడైనా హనుమకొండకు వెళితే కొనడమే! యువ తొందరగానే ఆగిపోయింది. అందులో చక్రపాణి అనువాదం చేసిన ఏదైనా బెంగాలీ నవల తప్పకుండా ఉండేది. ‘మట్టిగాజులు’ అనే నవల నాకింకా జ్ఞాపకం. స్వాతి మంత్లీ వాళ్లు అప్పటి నుంచీ ప్రతి నెలా ఒక నవలను ఇవ్వడం సంప్రదాయంగా పెట్టుకుని కొనసాగిస్తున్నారు. అప్పటి నవలల్లో రచయితల పేర్లు గుర్తు లేవు గానీ, ‘బాంధవ్య బంధితులు, ఇందుమతి, కావ్యనాయిక’ లాంటి కొన్ని నవలలు ఇంకా గుర్తున్నాయి.
పాతవే కాదు, మా యవ్వనపు తొలి రోజుల్లో, ఆ తరువాతా వచ్చిన కథలు, నవలలు కూడా బోలెడన్ని చదివేవాళ్లం. మేము అమ్మతో ఆ కథాంశాలు, పాత్రల చిత్రణ, సన్నివేశాల గురించి కూడా చర్చించేవాళ్లం. బెంగాలీ నవలల్లోని కుటుంబ వాతావరణం, పాత్రల ఉదాత్తత మన తెలుగువాళ్లకు దగ్గరగా అనిపించేది. మా చిన్నమ్మల్లో కొందరు, కజిన్స్లో కొందరు, స్నేహితులు కూడా పుస్తకాలు చదివేవారు. ఇప్పటి టీవీ చానెల్స్‌లో డిబేట్స్ లాగా కొన్నిసార్లు గట్టిగట్టిగా చర్చించుకునేవాళ్లం. ‘ఇంగ చర్చలు జాలు తియ్యండి, అన్నాలు తిందురు గాని రాండి’ అని అమ్మ పిలిచేది. కొద్దో గొప్పో ఈ మాత్రం ఆలోచనా శక్తి గానీ, రచనా శక్తి గానీ నాకు అబ్బిందంటే పుస్తకాలే కారణం.
ఆనాటి సాహిత్య వైభవానికి గుర్తుగా అందులో కొన్ని బైండు పుస్తకాలు ఇంకా మా ఇంట్లో వున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ అంతిమ యాత్ర గురించిన సమాచారం ఉన్న ఆంధ్రపత్రిక ఇంకా ఉంది. ఆరు పైసల నుంచి పావలా దాకా వెల ఉన్న పత్రికలు ఉన్నాయి. కొన్నిటి పేజీలు ముట్టుకుంటే చిరిగేలాగా ఉన్నాయి. వాటిలో ‘కునేగా సెంటు, క్యూటికురా పౌడర్, గ్లాక్సో పాలడబ్బా లోద్ర, జీవన్ టోన్, రంభ మరికొళందు సెంటు, లక్స్ సబ్బు , డాల్డా, ప్యారీ చాక్లెట్లు… ఇలా అప్పటి వస్తువుల ప్రకటనలను ఇప్పుడు చూస్తుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది.
మాలతీ చందూర్ ‘ప్రమదావనం’ రెండు మూడు బైండు పుస్తకాలుగా ఉండేవి. కె.రామలక్ష్మి ‘ప్రశ్నలు- జవాబులు’ కూడా ఒక ప్రసిద్ధ శీర్షిక. అప్పటి బైండు పుస్తకాల్లో కొన్ని ఎవరో చూసి ఇస్తామని తీసుకెళ్లి పోగొట్టారు. ఆ తరువాత రోజుల్లో నేను ఎమెస్కో సంస్థలో సభ్యత్వం తీసుకుని నెలానెలా చాలా పుస్తకాలు తెప్పించేదాన్ని. తరువాతి రోజుల్లో వాళ్లు నడిపే ‘ పుస్తక ప్రపంచం’ అనుబంధ పత్రికలో నా కార్టూన్లు వచ్చాయి కూడా.
మా ఊరి లైబ్రరీలో నాన్న పేరు మీద ఉన్న కార్డుతో కూడా కథల పుస్తకాలు, నవలలు తెచ్చుకొని చదివి తొందరగా ఇచ్చేవాళ్లం.
ఒక దశలో అన్నీ మేము చదివిన పుస్తకాలే ఉండేవి. అలాంటప్పుడు లైబ్రరీలో పనిచేసే సత్యం ‘అమ్మాయిగారూ! మీరు చదివినవే ఉన్నాయండీ. రెండో రౌండు ఇమ్మంటారా!’ అనడిగేవాడు. అతను మా ఊరి వాడే కానీ, పుస్తకాలు చదివీ, చదివీ పుస్తక భాష మాట్లాడేవాడు. ‘కొత్త పుస్తకాలు ఎప్పుడు ఒస్తయి?’ అంటే ‘కనుక్కున్నానండీ! యద్దనపూడి, కోడూరి, లత, మాదిరెడ్డి.. వీళ్లంతా మీ కోసమే రాస్తున్నారట. తొందరలోనే పంపిస్తారట!’ అనేవాడు. అది అబద్ధమని తెలిసినా ‘సరే మరి! జల్దీ తెప్పించు’ అనేదాన్ని. లక్ష్మి, హైమక్కలు మా ఊరు వచ్చినప్పుడు గానీ, సరస్వతక్క, రాగక్క, వకుళక్క లాంటి ఇతర కజిన్స్తోగానీ మేము సాయంత్రం కాగానే ఫ్రెష్‌గా నడుచుకుంటూ లైబ్రరీకి వెళ్లేవాళ్లం. అది చూసి వెంకటేశ్వర్లు అనే కవి (నా క్లాస్మేట్ రాధ చిన్నాయన) ఓసారి కవిత రాసి నా చేతిలో పెట్టాడు. అందులో…
‘చదువుకున్న అమ్మాయిలు… ఎగురుతున్న రంగురంగుల సీతాకోక చిలుకలు కదులుతున్న సాలభంజికలు.. కావ్య నాయికలు.. వీధి వీధిలో నింపుతున్నారు వెలుగులు’ ఇలా ఇంకా కొన్ని పంక్తులు వున్నాయి. నేను చదివి ఊరుకోవచ్చు కదా! ఊహూఁ పోస్టుమాన్ లాగా తీసుకెళ్లి నాన్నకిచ్చాను. నాన్న ఆయన్ని పిలిచి ‘ఇదేందండీ.. ఇట్ల రాసిన్రూ?’ అన్నాడు. ఆయన వెంటనే ‘అయ్యో! అట్ల కాదండీ! అమ్మాయిలు నా బిడ్డల తీరుగనే, లైబ్రరీకి పొయ్యి ఒస్తుంటే.. మంచిగ చదువుకుంటున్నరు అని ముద్దుగ అనిపిచ్చి రాసిన. గంతే!’ అన్నాడు. నాన్న ఏమీ అనలేదు.
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి