చుంచుపల్లి, జూలై 25 : విద్యార్థుల సమస్యలను పరిషరించలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువత సమస్యలను పట్టించుకోకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తిప్పలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు తలుచుకుంటే రాజకీయ పార్టీల భవిష్యత్తును మార్చగలరని స్పష్టంచేశారు. శనివారం తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ఎన్కే నగర్‌లోని కమ్మ సత్రంలో వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధుల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత ఆగ్రహానికి ప్రభుత్వాలు బలికాక తప్పవని హెచ్చరించారు. దాచుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే సమయంలేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనలను తేలికగా తీసుకోకుండా వారి సమస్యలను పరిషరించాలని సూచించారు. కేంద్రంలో ఎదురైన పరిస్థితులను చూసిన తర్వాత కూడా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిరావడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రవిచంద్ర డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యతుతో రాష్ట్ర భవిష్యత్తు కూడా ముడిపడి ఉన్నందున ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ల సమస్య పరిషారం కోసం కలిసికట్టుగా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో నాయకులు తాటి వెంకటేశ్వర్లు, దిండిగాల రాజేందర్, శ్రీనివాస్, సీతామహాలక్ష్మి, శాంతి, అనుదీప్, అజిత్, బాలాజీనాయక్ తదితరులు పాల్గొన్నారు.