నాగిరెడ్డిపేట్, జనవరి 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లెప్రగతితో గ్రామాలన్నీ మెరుస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల్లో పురోగతి కనిపిస్తున్నది. కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. దీంతో పాలనా సౌలభ్యం ఏర్పడింది. గ్రామాల్లో అభివృద్ధి పనులపై పంచాయతీ పాలకవర్గాలకు పట్టు లభించింది. ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో రెండు, మూడు గ్రామాలు ఉండడంతో పాలకవర్గం ఏ గ్రామంలో కూడా అభివృద్ధి పనులపై సరైన దృష్టి కేంద్రీకరించలేకపోయేది. ప్రస్తుతం 500 జనాభా కలిగిన గ్రామాలన్నీ ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడ్డాయి. దీంతో సుమారు యాభై ఏండ్లుగా ఎవరూ పట్టించుకోని గ్రామాలు నేడు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. పల్లెప్రగతిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి రూ.ఎనిమిది లక్షలు వెచ్చించి ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. నిత్యం చెత్తను సేకరిస్తూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో గ్రామాల్లోని వీధులన్నీ మెరుస్తున్నాయి. చెత్త లేకపోవడంతో క్రిమి కీటకాలకు ఆవాసం లేకుండా పోయింది. వ్యాధులు కూడా ప్రజల దరిచేరడం లేదు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
గ్రామంలో దోమల బాధలేదు..
పల్లె ప్రగతిలో భాగంగా మా గ్రామంలో మురికి కాల్వలను శుభ్రం చేస్తున్నా రు. చెత్తను సేకరించి ట్రాక్ట ర్ ద్వారా వెంటనే డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో దోమల బాధ లేకుండా పోయింది.
– ఎల్లమొళ్ల శ్రీను, చీనూర్
వ్యాధులు ప్రబలడం లేదు..
పల్లెప్రగతిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ట్రాక్టర్ను మంజూరు చేసింది. దీని ద్వారా నిత్యం చెత్తను సేకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో గ్రామాలన్నీ శుభ్రంగా మారాయి. వ్యాధులు ప్రబలడం లేదు.
– శ్రీనివాస్, ఎంపీవో, నాగిరెడ్డిపేట్