బెళగావి: కాంగ్రెస్ (Congress) పాలిత కర్ణాటకలో (Karnataka) సీఎం పీఠం కోసం అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బల సమీకరణకు అక్కడ విందు రాజకీయాలు జోరందుకున్నాయి. ఒక పక్క తామిద్దరి మధ్య విభేదాలు లేవని సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటిస్తున్నా అధికారం కోసం ఇరు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయమే తమకు శిరోధార్యమని ప్రకటిస్తూనే ఎవరి ప్రయత్నాలు వారు జోరుగా కొనసాగిస్తున్నారు. సీఎం పీఠాన్ని ఆశిస్తున్న డీకే శివకుమార్ సహా సుమారు 30 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు గురువారం రాత్రి జరిగిన విందుకు హాజరయ్యారు.
మంత్రులు కేహెచ్ మునియప్ప, మంకల్ వైద్య, ఎంసీ సుధాకర్, ఎమ్మెల్యేలు ఎన్ఏ హరీస్, రమేశ్, బండి సిద్ధెగౌడ, హెచ్‌సీ బాలకృష్ణ, గణేశ్ హుక్కేరి, దర్శన్, ధ్రువనారాయణ, అశోక్ కుమార్ రవి, కేవై నంజేగౌడ తదితరులు ఈ విందుకు హాజరైనట్టు సమాచారం. బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, శివరామ్ హెబ్బార్ కూడా ఈ విందుకు హాజరయ్యారు. బెళగావి ఉత్తర మాజీ ఎమ్మెల్యే ఫిరోజ్ సయిత్ ఆధ్వర్యంలో అంతకు ముందు రాత్రి బెళగావిలో ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరైన క్రమంలో డీకే ఆధ్వర్యంలో మరో విందు సమావేశం జరగడం గమనార్హం. ఇది సాధారణ విందు సమావేశమేనని ఇద్దరు నేతలు పైకి ప్రకటించినా, ముఖ్యమంత్రి పీఠం కోసం బలసమీకరణలో జరుగుతున్న పోరాటంలో భాగంగానే ఇది జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
శీతాకాల సమావేశాల తర్వాత డీకేనే సీఎం..కాంగ్రెస్ ఎమ్మెల్యే జోస్యం
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాక శివకుమార్ సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని రామనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ శుక్రవారం ప్రకటించారు. సువర్ణ విధాన సౌధలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘శివకుమార్‌కు అవకాశం వచ్చింది. ఆయన ముఖ్యమంతి కానున్నారు. ఆయన పడ్డ కష్టం, శ్రమకు ఆయనకు ఆ పదవి వస్తుందని మేమంతా ఆశిస్తున్నాం. ఇదే విషయాన్ని ఇప్పటికే అధిష్ఠానానికి కూడా విన్నవించాం’ అని ఆయన అన్నారు. అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వారే సీఎంగా కొనసాగుతారు కదా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ ‘నంబర్లతో పనిలేదు.. అంతా అధిష్ఠానం నిర్ణయం మేరకే సాగుతుంది’ అని అన్నారు. కాగా, డిప్యూటీ సీఎం శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను ఎలాంటి బల ప్రదర్శనలోనూ భాగస్వామ్యం కావడం లేదని స్పష్టం చేశారు.