తమిళ అగ్రహీరో ధనుష్ చూడ్డానికి సింపుల్‌గా ఉంటారు. బయట ఎక్కువగా తెల్లపంచె, కాటన్ షర్ట్‌లోనే కనిపిస్తుంటారాయన. ఇంత సాదాసీదాగా కనిపించే ఆయన ఆహార్యం వెనుక అంతా షాకయ్యే నిజం ఒకటుంది. ఆ వివరాల్లోకెళ్తే.. ఇటీవల ధనుష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్.. ధనుష్ చేతికున్న వాచ్‌ని చూసి షాకయ్యాడు. ఎందుకంటే దాని విలువ అక్షరాలా రెండుకోట్ల యాభై లక్షలు. ఈ విషయాన్నే ధనుష్‌ని అడేశాడు ఆ జర్నలిస్ట్. దానికి ధనుష్ నవ్వి ఊరుకున్నారు తప్ప ఖండించలేదు. సింపుల్‌గా కనిపించే ధనుష్.. అంత ఖరీదైన వాచ్‌ని ధరించడం ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఈ విషయంపై ధనుష్ అంతరంగికుల్ని ప్రశ్నిస్తే షాకయ్యే నిజాలు బయటకొచ్చాయి. ధనుష్ దగ్గర వాచ్లకు సంబంధించి పెద్ద కలెక్షనే ఉందట. వాటి చిట్టా వింటే సామాన్యుల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమట. సాధారణంగా ఎవరిదగ్గరైనా ఒకట్రెండు వాచ్‌లు ఉంటాయి. కానీ ధనుష్ ఇంట్లో ఓ చిన్నసైజు వాచ్ షాపే ఉందట. వాటి ఖరీదు దాదాపు 50 నుంచి 60కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. రిచార్డ్ మిల్లె, పటేక్ ఫిలిప్ ఇలాంటి అత్యంత ఖరీదైన బ్రాండ్ వాచీలు ధనుష్ బీరువాలో ఉన్నాయట. ఆయన ప్రతిరోజూ ధరించే ఒక్క వాచీతో ఓ చిన్న సినిమా తీసేయొచ్చని ఇన్సైడ్ టాక్.
ఈ వాచీల విషయంలో ధనుష్‌కు ఓ ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్ కూడా ఉంది. దాని గురించి ఆయనే చెబుతూ ‘నాకు వాచీలంటే ఇష్టం. దాన్ని గుర్తించే చిన్నప్పుడు మా అమ్మ ప్రేమతో ఓ వాచీని కొనిచ్చింది. అది బ్యాటరీతో పనిచేసే ప్లాస్టిక్ వాచీ. దానికి లైట్లుండేవి. అవి వెలుగుతుంటే నాకు భలే సంబరంగా ఉండేది. ఇప్పుడు నాదగ్గర కోట్ల విలువైన బ్రాండెడ్ వాచీలున్నాయి. కానీ వాటన్నింటికంటే నాకు అమ్మ ప్రేమతో కొనిచ్చిన ఆ ప్లాస్టిక్ వాచీనే విలువైనది. అందుకే నేటికీ దాన్ని భద్రంగా దాచుకున్నా.’ అని తెలిపారు ధనుష్.