Panchami Theertham | తిరుచానూరు పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించిన కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో పెద్ద సంఖ్యలో పవిత్రస్నానాలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమీతీర్థ మహోత్సవం వైభవోపేతంగా జరిగిందన్నారు. వేలాదిమంది భక్తులు పుణ్య స్థానాలు ఆచరిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు పటిష్టమైన ఏర్పాట్లు చేసి, విజయవంతంగా జరిగాయన్నారు. అన్ని విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, పారిశుధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు. భక్తులందరికీ అమ్మవారి కరుణాకటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీతీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు. రూ.1.31 కోట్లు విలువైన 1.14 కిలోల బరువు గల బంగారు కమలముల హారం, వజ్రాల అడ్డిగ నగ, సారెతో పాటు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.

పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన కుంకుమపువ్వు, పైనాపిల్, డ్రై ఫ్రూట్స్, రెడ్ మరియు ఎల్లో రోజాపెటల్స్, వట్టివేరు, తులసిమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి. పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఒక టన్ను పుష్పాలతో ఏర్పాటు చేసిన మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో తామర పూలు, రోజాలు, లిల్లీలు తదితర సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ తో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. మధ్యాహ్నం 12.10 నుంచి 12.20 గంటల మధ్య పంచమి తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కాగా రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను విహరించగా.. అనంతరం రాత్రి 10 నుంచి 11 గంటల వరకు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం నిర్వహించారు. బుధవారం రోజున పద్మావతి అమ్మవారి ఆలయంలో సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు పుష్పయాగం వైభవోపేతంగా సాగనున్నది.
