హైదరాబాద్: సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం (Police Martyrs’ Memorial Day), పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా హైదరాబాద్ గోషామహాల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి డీజీపీ అంజనీ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీసు సేవల్లో తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు. భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా మారాయని చెప్పారు. అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో క్రైం రేట్ తగ్గుతూ వస్తున్నదని వెల్లడించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ సoడీప్ శాండిల్య, అడిషనల్ డీజీలు సౌమ్య మిశ్రా, శివధర్ రెడ్డి, సంజయ్ కుమార్ జైన్, అనీల్ కుమార్, మహేష్ భగవత్ లతోపాటు పలువురు పోలీసు వున్నతాధికారులు, రిటైర్డ్ డీజీపీలు, రిటైర్డ్ ఉన్నతాధికారులు, అమర పోలీసు కుటుంబాలు పెద్ద ఎత్తున హజరయ్యారు.
పోలీస్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ‘అమరులువారు’ అనే పుస్తకాన్ని డీజీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోలీస్ పరేడ్ ప్రత్యేకతగా నిలిచింది. దేశ వ్యాప్తంగా ఈ సంవత్సరం అమరులైన 189 మంది పోలీస్ అదికారుల పేర్లను ఈ సందర్భంగా చదివి వారి సేవలను స్మరించుకున్నారు.