శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల కల్యాణమూర్తులకు బంగారు ఆభరణాలు భక్తులు బహూకరించారు. ఆదివారం ఉదయం నెల్లూరుకు చెందిన డీవీ సరస్వతి.. ఆమె వదిన బట్టారం సరస్వతి జ్ఞాపకార్థం బంగారు వెండి ఆభరణాలను ఈవో లవన్నకు అందజేశారు. ఆభరణాలలో స్వామివారికి 13 గ్రాముల బంగారు బాషికం, నవరత్నాలు పొదిగిన 89 గ్రాముల తొమ్మిది పొరల యఙ్ఞోపవీతం, అమ్మవారికి 21 గ్రాముల పగడపు బంగారు గొలుసు, కుమారస్వామికి ఎమ్రాల్డ్ గ్రీన్డాలర్తో 28 గ్రాముల బంగారు గొలుసు, స్వామిఅమ్మవార్లకు 17 గ్రాముల నవరత్న కంకణాలు, 300 గ్రాములు నాలుగు వెండి గిన్నెలు, 850 గ్రాముల వెండి పళ్లెం విరాళంగా ఇచ్చారు. దాతలకు ఉభయ దేవాలయాల్లో స్వామిఅమ్మవార్ల దర్శనాలతోపాటు అమ్మవారి ప్రాకార మండపంలో వేదాశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. కానుకగా వచ్చిన ఆభరణాలను స్వామిఅమ్మవార్ల, సుబ్రహ్మణ్యస్వామివారి నిత్యకల్యాణోత్సవంలో వినియోగించాల్సిందిగా ఈవో ఆలయ సిబ్బందికి సూచించారు.