Pithapuram | ఓ భక్తురాలి అత్యుత్సాహం పెను ప్రమాదానికి కారణమయ్యేది. కార్తీక మాసంలో పూజలు చేసేందుకు ఆలయానికి వెళ్లిన ఓ మహిళ అతి భక్తితో కర్పూరాన్ని వెలిగించి హుండీలో వేసింది. దీంతో హుండీలో ఉన్న కరెన్సీ నోట్లకు నిప్పు అంటుకుని.. ఆలయమంతా పొగలు వ్యాపించాయి. ఆలయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం ఆలయంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.
కార్తీక మాసం శనివారం కావడంతో నిన్న పిఠాపురంలోని శృంగార వల్లభస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కాకినాడ జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ క్రమరంలో ఆలయానికి వచ్చిన ఓ మహిళ అతి భక్తితో కర్పూరం వెలిగించి, స్వామివారి హుండీలో వేసింది. దీంతో హుండీలో ఉన్న కరెన్సీ నోట్లకు నిప్పు అంటుకుంది. నోట్లు అంటుకోవడంతో కొద్దిసేపటికే హుండీ నుంచే పొగలు రావడం మొదలయ్యాయి. ఆలయంలో పొగలు అలుముకుంటూ ఉండటంతో ఆలయ సిబ్బంది గమనించారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే హుండీలో నీళ్లు పోసి మంటలు ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
మంటలు ఆర్పేందుకు నీళ్లు పోయడంతో హుండీ లోపల ఉన్న నోట్లు అన్నీ తడిచిపోయాయి. దీంతో ఆలయ సిబ్బంది తడిచి నోట్లను జాగ్రత్తగా పొడి బట్టతో తుడిచి ఆలయ ఆవరణలో ఎండబెట్టారు. అంతేకాకుండా హెయిర్ డ్రయ్యర్ తీసుకొచ్చి తడిచిన నోట్లను ఆరబెట్టారు. కాగా, అగ్ని ప్రమాదంలో నోట్లు చాలావరకు కాలిపోయినట్లుగా గుర్తించారు. అనంతరం అగ్ని ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించేందుకు ఆలయ సిబ్బంది వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ భక్తురాలు హుండీలో వెలుగుతున్న కర్పూరాన్ని వేయడాన్ని వారు గుర్తించారు. కాలిపోయిన డబ్బును భక్తురాలి వద్ద నుంచి రికవరీ చేస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు.
Temple staff at Sripada Srivallabha Mahasamsthanam in Andhra Pradesh’s Pithapuram had a very tedious day after a devotee allegedly put burning camphor in the donation box, immediately setting the notes on fire. pic.twitter.com/ExBdmuYi1L
— The Siasat Daily (@TheSiasatDaily) November 9, 2025