AP News | విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో దారుణం జరిగింది. దొంగ పోలీసు ఆట ఆడుదామని చెప్పి అత్తను కుర్చీకి కట్టేసి ఓ కోడలు నిప్పంటించింది. అత్త మరణించిన తర్వాత దీపం అంటుకుని చనిపోయిందని కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు పోలీసుల విచారణలో దొరికిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా పెందుర్తికి చెందిన అప్పన్నపాలెంలోని వర్షిణి అపార్ట్మెంట్స్లో మహాలక్ష్మీ (63) తన కొడుకు, కోడలు లలిత, మనుమరాలితో కలిసి ఉంటుంది. అయితే కొద్ది సంవత్సరాలుగా లలితతో మహాలక్ష్మీకి గొడవలు జరుగుతున్నాయి. దీంతో తనను చీటికిమాటికి తిడుతుందని అత్తపై లలిత పగ పెంచుకుంది. ఈ క్రమంలోనే ఆమెను చంపి అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే దొంగ పోలీసు ఆట ఆడుదామని అత్తను నమ్మించింది. ఆట పేరుతో అత్త మహాలక్ష్మీని లలిత కండ్లకు గంతలు కట్టడమే కాకుండా ఆమెను కుర్చీలో తాళ్లతో కట్టేసింది. అనంతరం ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించింది. నిప్పు అంటుకున్న తర్వాత అత్త అక్కడికక్కడే మరణించింది. అత్త మరణించిందని నిర్ధారించుకున్న అగ్ని ప్రమాదం జరిగిందంటూ కేకలు వేస్తూ అందర్ని పిలిచింది. ఇంట్లో దీపం అంటుకుని అగ్ని ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో అత్త మరణించిందని సీన్ క్రియేట్ చేసి కుటుంబసభ్యులతో పాటు ఇరుగుపొరుగువారిని తప్పుదారి పట్టించింది. అంతేకాకుండా పోలీసులకు కూడా ఆమెనే సమాచారం అందించింది.
వృద్ధురాలు మరణించిందనే సమాచారంతో ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాదంలో లలిత కూతురికి కూడా గాయాలయ్యాయి. ఘటనాస్థలిని మొత్తం పరిశీలించిన పోలీసులు.. అనుమానంతో లలిత ఫోన్ను చెక్ చేశారు. అందులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఒక వ్యక్తిని ఎలా చంపాలి? హత్య కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి? వంటి వివరాలను లలిత వెతికినట్లు గుర్తించారు. దీంతో అత్త పెట్టే వేధింపులు భరించలేక లలితనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.