హనుమకొండ, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తి, ప్రజలకు తీవ్రం నష్టం జరిగి వారం గడిచినా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం బాధితులను పట్టించుకోవడంలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్భాటంగా వచ్చి చూసినా వరద బాధితులకు తక్షణ సాయం కూడా అందడంలేదు. నష్టపోయిన వారికి వెంటనే సాయం అందించాలని అధికారులను ఆదేశించామని సీఎం చెప్పినా.. అవి పరిస్థితి మాత్రం ఏమీ మారలేదు. వరదలో నష్టం జరిగిన ప్రాంతాలు ఏమిటనేది అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నా సాయం అందించేందుకు సర్కారుకు చేతులు రావడంలేదని బాధితులు వాపోతున్నారు. సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ.. సర్వం కోల్పోయిన బాధితుల దయనీయ స్థితిని పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మొంథా తుపాను కారణంగా గత బుధవారం (అక్టోబర్ 29న) వచ్చిన భారీ వానలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో తీవ్ర నష్టం చేశాయి.
వరంగల్ నగరంలోని వేల ఇండ్లు నీట మునిగిపోయి, ప్రజలు సర్వం కోల్పోయారు. సీఎం రేవంత్‌రెడ్డి అక్టోబర్ 31న వరంగల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇండ్లు మునిగిన వారికి రూ.15 వేలు, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇస్తామని ప్రకటించారు. పంట, పశువులు నష్టపోయిన వారికి పరిహారం అందజేస్తామని చెప్పారు. ఇసుక మేటలు వేసిన పంటలకూ పరిహారం ఇస్తామని తెలిపారు. కానీ నిబంధనలు, సర్వేల పేరుతో తక్షణ సాయాన్ని వాయిదా వేస్తున్నది. వరదలు వచ్చి వారం దాటినా నష్టం అంచనాపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి నివేదికలు తయారు చేయలేదు. వరంగల్ నగరంలో దెబ్బతిన్న ఇండ్లు ఎన్ని అనేది ఇప్పటికీ తేల్చలేదు. గత ఆదివారం నష్టం అంచనా పని మొదలుపెట్టామని, అధ్యయనం ఆధారంగా ప్రభుత్వ సాయం అందుతుందని అధికారులు చెప్తున్నారు.
వరద బీభత్సవంతో వేల ఇండ్లు నీటి మునిగాయి. బియ్యం, ఉప్పు, పప్పు, నూనె సహా అన్ని రకాల నిత్యావసర వస్తువులు, బట్టలు నీటిలో కొట్టుకుపోగా, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా పనికి రాకుండాపోయాయి. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేదని బాధిత కుటుంబాలు విలపిస్తున్నాయి. వరంగల్‌లోని వందకు పైగా కాలనీలు వరద ముంపునకు గు రయ్యాయి. బాలాజీనగర్‌లో వంద ఫీట్ల రోడ్డులోని కాలనీలు, ఎన్టీఆర్ నగర్, బృందావన్ కాలనీ, రామన్నపేట, శివనగర్, జవహర్ కాలనీ, ద్వారకాసాయి కాలనీ, సదాశివ కాలనీ, మారుతి కాలనీ, అమరావతి కాలనీల ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. విపత్తు నిర్వహణలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం వరదల అనంతరం కీలకమైన పారిశుధ్య నిర్వహణను కూడా పట్టించుకోలేదు. సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చాలా విషయాలు ప్రకటించినా క్షేత్రస్థాయిలో పూర్తిగా నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. సీఎం పర్యటన రోజే వైద్య శిబిరాలు నిర్వహించి ఆ తర్వాత చేతులెత్తేశారు.
తుపానుతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పంటల్లో ఇసుక మేటల వల్ల నష్టపోయిన రైతులకు సాయం చేస్తామని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వ పరంగా ఇప్పటికీ నివేదికలు సిద్ధం కాలేదు. వరదలతో కోతకు వచ్చిన వరి కింద పడిపోగా ఇప్పటికీ వందల ఎకరాల్లో పంట నీటిలోనే ఉన్నది. అధికారుల నివేదికలలో ఇలాంటి పంటలను పరిగణలోకి తీసుకోవడంలేదు. పంట నష్టపోయిన పొలాలను సమగ్రంగా పరిశీలించడం లేదని రైతులు వాపోతున్నారు.
రోజూ పని చేస్తేనే తినే పరిస్థితి. వానలు పడ్డప్పుడు పులిహోర, ఇడ్లీ ఇచ్చిండ్రు. అధికారులు వివరాలు రాసుకుని పోయిండ్రు. ఏమీ సాయం చెయ్యలేదు. వరదతో ఇంట్ల బియ్యం, బట్టలు, సామాన్లు అన్నీ మునిగినయి.
-మడిపెళ్లి భాగ్యలక్ష్మి, సమ్మయ్యనగర్, హనుమకొండ
నేను హాస్టల్లో స్వీపర్‌గా పని చేస్త. వానలతో పరిస్థితి మొత్తం తారుమారైంది. రోడ్డు మీద అడుక్కుతిన్నట్టు ఉంది పరిస్థితి. ఇంట్ల సామాన్లు పాడైపోయినయి. అన్నం వండుకుందామంటే బియ్యం కూడా లేవు. మొత్తం తడిసిపోయినయి. సర్కారు సాయం చేసి ఆదుకోవాలె.
-నీమా శేరే జినివాల, సమ్మయ్యనగర్, హనుమకొండ